IPL 2023: ఆ విషయంలో సచిన్‌ టెండూల్కర్‌‌ను అధిగమించిన అర్జున్‌..

ఐపీఎల్‌లో సచిన్‌ చేయలేని దాని అర్జున్‌ చేసి చూపించాడు.

Update: 2023-04-19 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో సచిన్‌ చేయలేని దాని అర్జున్‌ చేసి చూపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇక అర్జున్‌ తీసిన తొలి వికెట్‌ అతడికి ఎంత గొప్పదో.. అతడి తండ్రి సచిన్‌ బౌలింగ్‌ గణాంకాలను పోల్చితే తెలుస్తుంది. ఎందుకంటే సచిన్‌ ఐపీఎల్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 2009వ సీజన్‌లో సచిన్‌ 6 ఓవర్లు వేసినప్పటికీ.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు సచిన్‌ను అర్జున్ అధిగమించడం విశేషం. 2009లో కోల్‌కతాపై ముంబయి తరఫున తొలిసారిగా బౌలింగ్‌ చేసిన సచిన్‌ మొదటి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చాడు. ఇటీవల అదే కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అర్జున్‌.. తొలి ఓవర్‌లో 5 పరుగులే ఇవ్వడం గమనార్హం.

అర్జున్‌ వికెట్‌ సాధించిన సమయంలో ముంబయి డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే సచిన్‌ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో అర్జున్ స్పందించాడు. ‘తొలి వికెట్‌ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాను. బంతిని కాస్త దూరంగా సంధించి.. లాంగ్‌ బౌండరీల కోసం ప్రయత్నించేలా బ్యాట్స్‌మెన్‌ను కవ్వించాలన్నది మా ప్రణాళిక. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని అర్జున్‌ తెలిపాడు.

Tags:    

Similar News