IPL 2023: మరో బిగ్ ఫైట్.. నేడు ఆర్సీబీతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఢీ..

IPL 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మరో బిగ్ ఫైట్ జరగనుంది.

Update: 2023-04-25 18:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మరో బిగ్ ఫైట్ జరగనుంది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ.. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు వరుస పరాజయాలతో పూర్తిగా చతికిలపడిన కేకేఆర్.. ఆర్‌సీబీని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకున్న ఆర్‌సీబీకి మిడిలార్డర్ వైఫల్యం వేధిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ మినహా మరే బ్యాటర్ రాణించడం లేదు. బౌలింగ్‌లో సిరాజ్‌కు తోడుగా డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించారు.

యువ పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ మరోసారి విఫలమవ్వగా.. వానిందు హసరంగా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఇక చీలమండ గాయంతో ఈ టోర్నీ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైన జోష్ హజెల్‌వుడ్ పూర్తిగా కోలుకోన్నాడు. కేకేఆర్‌‌తో అతను ఆడే అవకాశాలున్నాయి. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ టీమ్ బ్యాటింగ్ బాధ్యతలు మోస్తుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వానిందు హసరంగా కొనసాగుతున్నాడు. డేవిడ్ విల్లే సైతం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. హజెల్ వుడ్‌ను కచ్చితంగా ఆడించాలనుకుంటే మాత్రం విల్లేనే పక్కనపెట్టనున్నారు.


మిడిలార్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనుకుంటే మాత్రం హసరంగా స్థానంలో డేంజరస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఆడించే అవకాశం ఉంది. మహిపాల్ లోమ్రోర్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లకు మరో అవకాశం దక్కనుంది. దినేశ్ కార్తీక్ సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఫాఫ్ డుప్లెసిస్.. ఈ మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగనున్నాడు. మరోసారి కోహ్లీనే జట్టును నడిపించనున్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు(అంచనా):

విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా/మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే/ జోష్ హజెల్‌వుడ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు(అంచనా):

ఎన్ జగదీసన్ (wk), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Tags:    

Similar News