చెప్పి మరీ సిక్స్ కొడితే ఆ కిక్కే వేరు : శుభ్‌మన్ గిల్
అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, సిక్స్ కొడతానని అతనికి ముందే చెప్పానని గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
అహ్మదాబాద్: అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, సిక్స్ కొడతానని అతనికి ముందే చెప్పానని గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కిన గిల్.. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు అదే జట్టుపై సెంచరీ చేశానని తెలిపాడు.
భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఎంతో సంతోషాన్నిచ్చింది. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని అతనికి ముందే చెప్పినట్టుగానే సిక్స్ బాదాను’ అని చెప్పాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ల అని చెప్పుకొచ్చిన గిల్.. వారి వల్లే తాను క్రికెటర్ అయ్యానని తెలిపాడు. ‘నాకు క్రికెట్ గురించి తెలిసినప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతనికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేసాయి.’ అని గిల్ తెలిపాడు.