ఆర్సీబీ ఓటములకు కారణం అదే.. కొత్త పాయింట్ చెప్పిన సెహ్వాగ్
ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సపోర్టింగ్ స్టాఫ్‌లో భారతీయులు లేకపోవడమే ఆ జట్టు ఓటమి కారణమన్నాడు. తాజాగా జాతీయ మీడియాతో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘జట్టులో 12 నుంచి 15 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 10 మంది మాత్రమే విదేశీ ప్లేయర్లు ఉన్నారు. కానీ, సపోర్టింగ్ సిబ్బంది మొత్తం విదేశీయులే. అదే అసలు సమస్య.’ అని తెలిపాడు.
భారత క్రికెటర్లలో సగం మందికి ఇంగ్లీష్ అర్థం కాదని, అలాంటప్పుడు వారిలో ఎవరు స్ఫూర్తినింపుతారు?. వారితో ఎవరు సమయం గడుపుతారు?. వారితో ఎవరు మాట్లాడుతారు? అని ప్రశ్నించాడు. ‘సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒక్క భారతీయుడిని చూడలేదు. కెప్టెన్ డుప్లెసిస్ వద్ద ఆటగాళ్లు మౌనంగా ఉంటారు. ఎందుకుంటే, అతనేదైనా అడిగితే వాళ్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే ఇండియన్ కెప్టెన్ అయితే ప్లేయర్లు తాము అనుకున్నది చెప్పగలరు. కానీ, విదేశీ ప్లేయర్ వద్ద అలా ఉంటే వచ్చే మ్యాచ్‌లో తుది జట్టు నుంచి తప్పించొచ్చు. ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ సిబ్బంది అవసరం ఉంది.’ అని సెహ్వాగ్ వివరించాడు.