ఢిల్లీ బోణీ.. చెన్నయ్‌కు తొలి ఓటమి

ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.

Update: 2024-03-31 18:09 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు ఎట్టకేలకు సీజన్‌లో గెలుపు ఖాతా తెరిచింది. మరోవైపు, వరుసగా రెండు విజయాలు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ తొలి ఓటమిని రుచిచూసింది.విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191/5 స్కోరు చేసింది.

కారు ప్రమాదం తర్వాత ఐపీఎల్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టిన కెప్టెన్ రిషబ్ పంత్(51) గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే, ఓపెనర్ డేవిడ్ వార్నర్(52) కూడా అర్ధ శతకం బాదగా.. పృథ్వీ షా(43) సైతం మెరిశాడు. చెన్నయ్ బౌలర్లలో పతిరణ(3/31) రాణించాడు.

అనంతరం 192 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నయ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 171/6 స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని నిలువరించారు. అజింక్య రహానే(45), మిచెల్(34) సత్తాచాటగా.. ఆఖర్లో ధోనీ(37) మెరుపులు మెరిపించాడు. అతనితోపాటు జడేజా(21 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. అయితే, అప్పటికీ చెన్నయ్ ఓటమి ఖరారు కావడంతో ధోనీ మెరుపులు ఫలించలేదు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లతో చెన్నయ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అక్షర్ పటేల్‌కు ఒక్క వికెట్ దక్కింది. 

Tags:    

Similar News