చెన్నయ్ వేట షురూ.. ఓపెనింగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై గెలుపు

తొలి మ్యాచ్‌తోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ వేట మొదలుపెట్టింది.

Update: 2024-03-22 19:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌తోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ వేట మొదలుపెట్టింది. శుక్రవారం చెన్నయ్ వేదికగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఒక దశలో 78/5 స్కోరుతో కష్టాల్లో నిలిచిన ఆ జట్టును అనుజ్ రావత్(48), దినేశ్ కార్తీక్(38) ఆదుకున్నారు. 6వ వికెట్‌కు ఈ జోడీ 95 పరుగులు జోడించడంతో ఆర్సీబీ మెరుగైన స్కోరు చేసింది. పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(4/29) సత్తాచాటాడు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నయ్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. తలా ఓ చేయి వేయడంతో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్కే..18.4 ఓవర్లలో 176 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(37), ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబె(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రహానే(27), డారిల్ మిచెల్(22) విలువైన పరుగులు జోడించారు. 4 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

చెన్నయ్ సమిష్టిగా

174 పరుగుల టఫ్ టార్గెట్ ఛేదనలో మొదట సీఎస్కేకు సరైన ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన కెప్టెన్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(15) క్రీజులో నిలువలేకపోయాడు. అయితే, మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(37) మాత్రం ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. మూడేసి ఫోర్లు, సిక్స్‌లతో ధాటిగా ఆడాడు. గైక్వాడ్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే(27) కూడా దూకుడుగానే కనిపించాడు. కాసేపటి తర్వాత ఈ జోడీని కర్ణ్ శర్మ విడదీశాడు. అతని బౌలింగ్ రచిన్ రవీంద్ర అవుటవ్వగా.. కాసేపటికే రహానే కూడా పెవిలియన్ చేరాడు. డారిల్ మిచెల్(22) దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ అవుటయ్యాడు. ఆ సమయానికి చెన్నయ్ విజయానికి 42 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శివమ్ దూబె(34 నాటౌట్), జడేజా(25 నాటౌట్)తో కలిసి ధాటిగా ఆడటంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే చెన్నయ్ గెలుపు లాంఛనమైంది. బెంగళూరు బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు తీయగా.. యశ్ దయాల్‌కు ఒక్క వికెట్ దక్కింది.

బెంగళూరును ఆదుకున్న అనుజ్, కార్తీక్

అంతకుముందు బెంగళూరు బ్యాటింగ్ చూస్తే ఒక దశలో ఆ జట్టు 100-120 మధ్యలో పరిమితమవుతుందని అనిపించింది. కానీ, చెన్నయ్ ముందు బెంగళూరు 174 పరుగుల లక్ష్యం పెట్టిందంటే అనుజ్ రావత్(48), దినేశ్ కార్తీక్(38 నాటౌట్) పోరాటమే కారణం. టాప్-5 బ్యాటర్లలో డు ప్లెసిస్(35) మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినా.. పేసర్ ముస్తాపిజుర్ రెహ్మాన్ ధాటికి బెంగళూరు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. 5వ ఓవర్‌లో డుప్లెసిస్‌‌తోపాటు రజత్ పటిదార్(0)ను ముస్తాఫిజుర్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ప్రమాదకరమైన మ్యాక్స్‌వెల్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే మరోసారి బంతితో రెచ్చిపోయిన ముస్తాఫిజుర్..నిదానంగా ఆడుతున్న కోహ్లీ(21) , గ్రీన్(18)లను ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్ జట్టును ఆదుకున్నారు. ఆఖరి ఆరు ఓవర్లలో ఈ జోడీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్స్‌లు బాదారు. 18వ ఓవర్‌లో ఈ జోడీ 25 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి అనుజ్ రావత్ రనౌటైనా.. 7 వికెట్‌కు కార్తిక్‌తో కలిసి 95 పరుగులు జత చేయడంతో బెంగళూరుకు మంచి స్కోరు దక్కింది. చెన్నయ్ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. దీపక్ చాహర్‌కు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 173/6(20 ఓవర్లు)

కోహ్లీ(సి)రచిన్ రవీంద్ర(బి)ముస్తాఫిజుర్ 21, డు ప్లెసిస్(సి)రచిన్ రవీంద్ర(బి)ముస్తాఫిజుర్ 35, రజత్ పటిదార్(సి)ధోనీ(బి)ముస్తాఫిజుర్ 0, మ్యాక్స్‌వెల్(సి)ధోనీ(బి)చాహర్ 0, గ్రీన్(బి)ముస్తాఫిజుర్ 18, అనుజ్ రావత్ రనౌట్(ధోనీ) 48, కార్తిక్ 38 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.

వికెట్ల పతనం : 41-1, 41-2, 42-3, 77-4, 78-5, 173-6

బౌలింగ్ : చాహర్(4-0-37-1), తుషార్ దేశ్‌పాండే(4-0-47-0), తీక్షణ(4-0-36-0), ముస్తాఫిజుర్(4-0-29-4), జడేజా(4-0-21-0)

చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 176/4(18.4 ఓవర్లు)

రుతురాజ్ గైక్వాడ్(సి)గ్రీన్(బి)యశ్ దయాల్ 15, రచిన్ రవీంద్ర(సి)రజత్ పటిదార్(బి)కర్ణ్ శర్మ 37, రహానే(సి)మ్యాక్స్‌వెల్(బి)గ్రీన్ 27, మిచెల్(సి)రజత్ పటిదార్(బి)గ్రీన్ 22, శివమ్ దూబె 34 నాటౌట్, జడేజా 25 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 16.

వికెట్ల పతనం : 38-1, 71-2, 99-3, 110-4

బౌలింగ్ : సిరాజ్(4-0-38-0), యశ్ దయాల్(3-0-28-1), జోసెఫ్(3.4-0-38-0), కర్ణ్ శర్మ(2-0-24-1), మయాంక్ దగర్(2-0-6-0), గ్రీన్(3-0-27-2), మ్యాక్స్‌వెల్(1-0-7-0)

Tags:    

Similar News