స్టోయినిస్ అదరహో.. చెన్నయ్‌కు షాకిచ్చిన లక్నో

చెన్నయ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

Update: 2024-04-23 19:07 GMT

దిశ, స్పోర్ట్స్ : స్టోయినిస్ అదరహో.. చెన్నయ్ భారీ లక్ష్యం ముందు ఏమాత్రం బెదరని అతను అసామాన పోరాటంతో లక్నోకు సూపర్ విక్టరీ అందించాడు. చెన్నయ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. దీంతో వరుస మ్యాచ్‌ల్లో చెన్నయ్‌ను లక్నో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్(108 నాటౌట్) అజేయ శతకంతో చివరి వరకు నిలిచాడు. అతనికితోడు శివమ్ దూబె(66) మెరుపులు మెరిపించడంతో చెన్నయ్‌కు భారీ స్కోరు దక్కింది. అయితే, 211 పరుగుల లక్ష్యాన్ని చెన్నయ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 19.3 ఓవర్లలో 213/4 స్కోరు చేసింది. స్టోయినిస్(124 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. పూరన్(34), దీపక్ హుడా(17 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. ఈ విజయంతో లక్నో నాలుగో స్థానానికి చేరుకోగా.. వరుసగా రెండు పరాజయాలతో చెన్నయ్ ఐదో స్థానానికి పడిపోయింది.

స్టోయినిస్ అసామాన పోరాటం

ఓపెనర్ డికాక్(0) తొలి ఓవర్‌లో డకౌటవడంతో ఛేదనలో లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ అంతా తానై జట్టును నడిపించాడు. చాహర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి దూకుడు మొదలుపెట్టిన అతను చివరి వరకూ అదే జోరును కొనసాగించాడు. అయితే, మరో ఎండ్‌లో అతనికి సరైన సహకారం అందలేదు. కేఎల్ రాహుల్(16), దేవదత్ పడిక్కల్(13) నిరాశపరిచారు. అయినప్పటికీ, బౌలర్లను ఏమాత్రం లెక్కచేయని స్టోయినిస్ బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే అతను 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. పడిక్కల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ కాసేపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టోయినిస్‌తో కలిసి అతను బ్యాటు ఝుళిపించడంతో 16 ఓవర్లలో లక్నో 157/3 స్కోరుతో నిలిచి పోటీలోకి వచ్చింది. అంతా కుదురుకున్నదనుకున్న సమయంలో పూరన్(34)ను అవుట్ చేసిన పతిరణ ఈ జోడీని విడదీసి దెబ్బకొట్టాడు. కాసేపటికే సెంచరీ పూర్తి చేసిన స్టోయినిస్.. దీపక్ హుడా(17 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. హుడా, స్టోయినిస్ కలిసి 18, 19 ఓవర్లలో 15 రన్స్ చొప్పున రాబట్టడంతో చివరి ఓవర్‌లో లక్ష్యం 17గా మారింది. ఆఖరి ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ స్టోయినిస్‌ను నిలువరించలేకపోయాడు. వరుసగా సిక్స్, మూడు ఫోర్లు కొట్టి జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. చెన్నయ్ బౌలర్లలో పతిరణ 2 వికెట్లు, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

గైక్వాడ్, దూబె అదరహో

అంతకుముందు చెన్నయ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే రహానే(1) వికెట్ పారేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్(11) కూడా నిరాశపరిచాడు. కానీ, మరో ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు అండగా నిలిచాడు. మొదటి నుంచి ధాటిగా ఆడిన అతను పవర్ ప్లేలో మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, మ్యా్ట్ హెన్రీ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జడేజా సహకారంతో గైక్వాడ్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోఎండ్‌లో, స్వల్ప స్కోరుకే పరిమితమైన జడేజా(16) మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకపోయిన గైక్వాడ్‌కు దూబె కూడా తోడవడంతో పరుగుల వరద పారింది. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో దూబె హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. మరోవైపు, దూకుడు కొనసాగించిన గైక్వాడ్ 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టి 56 బంతుల్లో సెంచరీ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రెచ్చిపోయిన దూబె రెండు సిక్స్‌లు, ఫోర్ బాది 22 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఇక, చివరి ఓవర్‌లో స్టోయినిస్ బౌలింగ్‌లో దూబె(66) రనౌటవడంతో 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ధోనీ(4 నాటౌట్) చివరి బంతిని ఫోర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ముగించగా.. గైక్వాడ్(108 నాటౌట్) చివరి వరకు నిలిచాడు. లక్నో బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

స్కోరుబోర్డు

చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 210/4(20 ఓవర్లు)

రహానే(సి)రాహుల్(బి)మ్యాట్ హెన్రీ 1, రుతురాజ్ గైక్వాడ్ 108 నాటౌట్, డారిల్ మిచెల్(సి)దీపక్ హుడా(బి)యశ్ ఠాకూర్ 11, జడేజా(సి)రాహుల్(బి)మోహ్సిన్ ఖాన్ 16, శివమ్ దూబె రనౌట్(డికాక్/స్టోయినిస్) 66, ధోనీ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం : 4-1, 49-2, 101-3, 205-4

బౌలింగ్ : మ్యాట్ హెన్రీ(4-0-28-1), మోహ్సిన్ ఖాన్(4-0-50-1), రవి బిష్ణోయ్(2-0-19-0), యశ్ ఠాకూర్(4-0-47-1), స్టోయినిస్(4-0-49-0), కృనాల్ పాండ్యా(2-0-15-0)

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 213/4(19.3 ఓవర్లు)

డికాక్(బి)చాహర్ 0, కేఎల్ రాహుల్(సి)గైక్వాడ్(బి)ముస్తాఫిజుర్ 16, స్టోయినిస్ 124 నాటౌట్, దేవదత్ పడిక్కల్(బి)పతిరణ 13, పూరన్(సి)శార్దూల్(బి)పతిరణ 34, దీపక్ హుడా 17 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 0-1, 33-2, 88-3, 158-4

బౌలింగ్ : దీపక్ చాహర్(2-0-11-1), తుషార్ దేశ్‌పాండే(3-0-34-0), ముస్తాఫిజుర్(3.3-0-51-1), శార్దూల్ ఠాకూర్(3-0-42-0), మొయిన్ అలీ(2-0-21-0), జడేజా(2-0-16-0), పతిరణ(4-0-35-2)

Tags:    

Similar News