గ్రౌండ్ సిబ్బందికి బీసీసీఐ భారీ నజరానా.. ఒక్కొక్కరికీ ఎంతో తెలుసా?
ఐపీఎల్-17 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఎగరేసుకపోయింది. ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఎగరేసుకపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. దాదాపు రెండు నెలలపాటు సాగిన లీగ్ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ సక్సెస్ అవడంలో గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లు కీలక పాత్ర పోషించారు. స్వల్ప రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌లకు మైదానాలను సిద్ధం చేయడం అంత సులభమైనది కాదు. అలాగే, ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆటకు మైదానాన్ని, పిచ్‌ను సిద్ధం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నది.
ఈ నేపథ్యంలో వారి సేవలను గుర్తించిన బీసీసీఐ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు అందజేయనుంది. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ సెక్రెటరీ జై షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ఈ సీజన్ సక్సెస్ అవడంలో గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లు పాత్ర కూడా ఉంది. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ వారు అద్భుతమైన పిచ్‌లు అందించారు. ఐపీఎల్ రెగ్యులర్ 10 వేదికల్లోని గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. అలాగే, అదనపు మూడు వేదికల్లో ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందజేస్తాం. మీ అంకితభావం, శ్రమకు ధన్యవాదాలు.’ అని జైషా తెలిపాడు. అయితే, ఐపీఎల్‌లో గ్రౌండ్ సిబ్బందికి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2022లో బీసీసీఐ రూ.1.25 కోట్లు నగదు బహుమతి ప్రకటించింది.