కోహ్లీ, గవాస్కర్ మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే?
Angry Sunil Gavaskar Blasts Virat Kohli's Rant. Says, ‘Don’t Have Agenda, Why Are You Replying To Outside Nois’
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే.. గత నెల 25న హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విరాట్ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 118.60 స్ట్రైక్ రేట్‌తో ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చాయి. కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడని, సింగిల్స్‌కే పరిమితమయ్యాడని సునీల్ గవాస్కర్ కూడా కామెంట్ చేశాడు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఇటీవల కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. గత నెల 28న గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. మ్యాచ్‌లో పరిస్థితుల గురించి తెలియకుండా, కామెంటేటర్ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదన్నాడు. దీంతో పరోక్షంగా సునీల్ గవాస్కర్‌కు విరాట్ కౌంటర్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
తాజాగా శనివారం గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అలాంటి వ్యాఖ్యలు విశ్లేషకులుగా పనిచేస్తున్న మాజీ క్రికెటర్లను అవమానించమే అవుతుందని అభిప్రాయపడ్డాడు. ‘అతని స్ట్రైక్‌రేట్ 118 ఉన్నప్పుడు మాత్రమే కామెంటేటర్లు ప్రశ్నించారు. నేను ఎక్కువగా మ్యాచ్‌లు చూడను. కాబట్టి, మిగతా కామెంటేటర్లు ఏమన్నారో నాకు తెలియదు. ఓపెనర్‌గా వచ్చి 14వ లేదా 15వ ఓవర్‌లో అవుటైనప్పుడు మీ స్ట్రైక్ రేట్ 118గా ఉంటే చప్పుట్లు కోరుకుంటున్నారా?. అది వేరేలా ఉంటుంది. బయటి నుంచి వచ్చే కామెంట్లను మేము పట్టించుకోమని చెబుతుంటారు. మరెందుకు సమాధానమిస్తున్నారు.’ అంటూ ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగని గవాస్కర్.. ‘మేము చాలా క్రికెట్ ఆడకపోయినా.. కొంత ఆడాం. మాకు ఎజెండాలు లేవు. చూసిన దానికి గురించే మాట్లాడతాం. కచ్చితమైన ఇష్టాలు, అయిష్టాలు ఉండవు. ఒకవేళ ఉన్నా నిజంగా ఏం జరిగిందో అదే మాట్లాడుతాం.’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. మరి, దీనికి కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.