ముంబైకి బిగ్ షాక్! జట్టును వీడనున్న రోహిత్, సూర్య, మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!

Update: 2024-04-18 20:04 GMT

దిశ, స్పోర్ట్స్: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. రోహిత్‌ను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం, దానికి తోడు వరుస ఓటములతో, జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంచనాలను అందుకోలేకపోతున్న ముంబై జట్టుకు వచ్చే ఏడాది భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు స్టార్ ప్లేయర్లు ఆ జట్టును వీడనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం, ముంబై జట్టును వీడే ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే..

రోహిత్ శర్మ

వచ్చే ఏడాది ముంబైని వీడే ఆటగాళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రోహిత్ శర్మ. పదేళ్లపాటు ముంబై జట్టును విజయవంతంగా నడిపించిన రోహిత్‌ను.. అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తొలగించి, హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడంపై హిట్‌మ్యాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కావున, వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబై జట్టును వీడే అవకాశం ఉంది.

సూర్యకుమార్ యాదవ్

హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడంపై సూర్యకుమార్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వేలంలోకి వెళ్తే ఇతర జట్లు కూడా సూర్యను భారీ ధరకు దక్కించుకుంటాయనడంలో సందేహం లేదు. అందువల్ల, సూర్య వచ్చే సీజన్‌లో ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టే అవకాశం ఉంది.

టిమ్ డేవిడ్

గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టిమ్ డేవిడ్.. ఈ సీజన్‌లో మాత్రం రాణించడం లేదు. రూ.8.25కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆసిస్ ఆటగాడి ప్రదర్శనపై ముంబై యాజమాన్యం అసంతృప్తితో ఉంది. కావున, వేలంలో టిమ్ డేవిడ్‌ను రిలీజ్ చేసే అవకాశముందని సదరు మీడియా సంస్థ వెల్లడించింది.

నేహాల్ వధేరా

ఈ సీజన్‌లో నెహాల్ వధేరాకు ఒక్క అవకాశం కూడా దక్కలేదు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 241 పరుగులతో ఆకట్టుకున్న ఈ యువ బ్యాటర్‌ను ఈసారి తుది జట్టులోకి తీసుకోవడం లేదు. దీంతో వచ్చే ఏడాది నేహాల్ వేలంలోకి వచ్చే అవకాశముంది.

మహ్మద్ నబీ

ఈ సీజన్‌లో ఏమాత్రం ప్రభావం చూపని ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ. వయసు పైబడిన కారణంగా ఈ ఆల్‌రౌండర్‌కు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు.



Similar News