ప్రాణం తీసిన అనుమతి లేని విద్యుత్ కనెక్షన్
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో రోజువారీ కూలి పని చేసుకునే ఒకరు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో రోజువారీ కూలి పని చేసుకునే ఒకరు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్సై గౌస్ తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే... భైంసా నుండి నిర్మల్ వెళ్లే రహదారిలో గల బృందావన కాలనీ బంధన్ బ్యాంక్ సమీపంలో ఒకరు నూతన ఇంటి నిర్మాణం చేపట్టగా ఏపీ నగర్ కు చెందిన బందరి మారుతి (45) ఆ ఇంటి నిర్మాణంలో రోజులాగే కూలికి వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురై, అక్కడికక్కడే చనిపోయారని పేర్కొన్నారు.
నూతన ఇంటి నిర్మాణానికి ఇంకా విద్యుత్ మీటర్ కలెక్షన్ తీసుకోలేదని, ఆ ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇల్లీగల్ గా విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రి కి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.