అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
వైరాలోని ఓ పామాయిల్ తోట సమీపంలో అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, వైరా : వైరాలోని ఓ పామాయిల్ తోట సమీపంలో అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరాలో ఇటీవల సీఎం సభ నిర్వహించిన స్థలం సమీపంలో రైతు మునిరెడ్డి పామాయిల్ తోట పక్కనే ఉన్న పొలంలో కొణిజర్ల మండలం లాలాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బందెల కృష్ణయ్య (45) ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైరాలోని బొర్రా నాగేశ్వరరావుకు చెందిన పది ఎకరాల పొలాన్ని బొర్రా భరత్ తో పాటు లాలాపురంనకు చెందిన హాసన్ కౌలుకు తీసుకున్నారు. లాలాపురం గ్రామానికి చెందిన నల్లబోలు పాపిరెడ్డి ట్రాక్టర్ ను ఈ పొలాన్ని దున్నేందుకు ఆదివారం ఉదయం తీసుకువచ్చారు. తన కుమారుడు అందుబాటులో లేకపోవడంతో పాపిరెడ్డి
పొలం దున్నేందుకు ఒక్కరోజు యాక్టింగ్ డ్రైవర్ గా కృష్ణయ్యను విధుల్లోకి తీసుకున్నారు. అయితే పొలం దున్నుతున్న సమయంలో ఇతర పనులపై బొర్రా భరత్ హసన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం డ్రైవర్ కృష్ణయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కృష్ణయ్య మృతదేహం ఉన్న ప్రాంతానికి 10 ఎకరాల దూరంలో ట్రాక్టర్ ఉంది. అయితే పొలం దున్నే సమయంలో ట్రాక్టర్ పైనుంచి కృష్ణయ్య జారీ కింద పడటంతో ఆ ట్రాక్టర్ అతని పైకి ఎక్కి కొంత దూరం ప్రయాణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుని కుటుంబ సభ్యులు విద్యుత్ షాక్ తగిలి ఉండొచ్చని భావించటం తో పాటు ఇతర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.