చుక్కాపూర్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్

Update: 2024-08-25 14:10 GMT

దిశ,తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒకటి నుండి మూడు గంటల ప్రాంతంలో దర్జాగా ఎర్టిక కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో సహా మరో 9 మంది రైతులకు చెందిన ట్రాక్టర్ బ్యాటరీలను, ఒక టిప్పర్ కు చెందిన రెండు బ్యాటరీలను చోరీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత మూడు సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో అర్ధరాత్రి పూట రైతులకు చెందిన 14 బోరు మోటార్ల కేబుల్ వైర్లను స్టార్టర్ ను ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా గత సంవత్సరం క్రితం చుక్కాపూర్, చీపునుంతల ,తుమ్మల కుంట తండా, ఎక్స్ రోడ్ సమీపంలో కూడా దొంగలు రెక్కీ నిర్వహించి 10 నుంచి 15 మందికి చెందిన ట్రాక్టర్లు, టిప్పర్ల బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. వీటికి తోడు వ్యవసాయ పొలాల్లో ఉండే మేకలను, పశువులను కూడా ఎత్తుకెళ్లారు. ఆరు నెలల క్రితం కూడా చుక్కాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు చెందిన ట్రాక్టర్ బ్యాటరీలను ఎత్తుకెళ్లిన సంఘటన మర్చిపోకముందే దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఏకంగా 8 మంది రైతులు గండికోట వెంకటయ్య, గండికోట నరసింహ, మండే మల్లయ్య, వరికుప్పల యాదయ్య,మాకం రఘు, దాసరి గోపాల్ ,డాక్యా నాయకులకు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెందిన బ్యాటరీలు, ఎండి అజ్జు కు చెందిన టిప్పర్ రెండు బ్యాటరీలను సైతం దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు.

తీరా రైతులు తెల్లవారిన తర్వాత వ్యవసాయ పనులు నిమిత్తం తమ తమ ట్రాక్టర్లను పొలం పనులకు తీసుకెళ్లడానికి వెళ్లి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు చెందిన బ్యాటరీ ఎతికెళ్లడంతో ఆదివారం గ్రామంలోని చెత్తను కూడా తరలించ లేక కార్మికులు కిమ్మనకుండా ఉండిపోయారు.ఆమనగల్ నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఇద్దరు ఇండ్లలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు దుండగులు తెల్లని ఎట్టికా కారులో వచ్చి బ్యాటరీలను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధిత రైతులు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవాలని చుక్కాపూర్ గ్రామ రైతులు పేర్కొంటున్నారు. గతంలో కూడా చోరీలు జరిగిన సమయంలో దొంగలు ఆనవాళ్లు పోలీసులకు లభించకపోవడంతో ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోయారు. కనీసం ఈసారైనా పోలీసులు దొంగలను పట్టుకుంటారో లేదో అని బాధిత రైతులు ఆవేదనకు గురైతున్నారు.


Similar News