ఫ్లెక్సీలో ఫోటో లేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
ఫ్లెక్సీలో తమ ఫోటో పెట్టలేదని, తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని
దిశ, మిర్యాలగూడ : ఫ్లెక్సీలో తమ ఫోటో పెట్టలేదని, తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తేజవత్ భగవాన్ గత పది సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా ఆదివారం కాలనీలో ఏర్పాటు చేసిన బోనాల పండుగ కు ఫ్లెక్సీ లో తన ఫోటో లేకపోవడంతో పాటు ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి ప్రాధాన్యత ఇస్తున్నారని మనస్థాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బంధువులు తెలిపారు. బాధితునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.