ఆ బిడ్డ... నా బిడ్డే ..మోసం చేసి అబార్షన్ చేశారు.. అభాగ్యురాలి ఆవేదన
ఆ ఆసుపత్రి ఆగడాలకు అంతులేకుండా పోయింది.
దిశ, భద్రాచలం : ఆ ఆసుపత్రి ఆగడాలకు అంతులేకుండా పోయింది.పచ్చ నోట్లతో పచ్చి నిజాలను కప్పిపుచ్చడం వారికి పరిపాటిగా మారింది. గతంలో ఈ ఆసుపత్రిలో జరిగిన నేరాలపై కేసులు ఏమయ్యాయో తెలియదు. ఇంతలోనే స్పృహలో లేని ఒక అభాగ్యురాలికి అబార్షన్ చేసి బిడ్డను నిర్ధాక్ష్యంగా గోదావరి వంతెన కింద పడవేసి చేతులు దులుపుకున్నారు. నాలుగు రోజుల క్రితం గోదావరి వంతెన కింద పసిబిడ్డ మృతదేహం లభించిన సంఘటన పాఠకులకు తెలిసిందే. ఈ విషయం పై ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మహిళ స్పందించింది. ఆ బిడ్డ... తన బిడ్డే నని, సిద్దు అనే వ్యక్తి పెండ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసి గర్భం దాల్చిన నాకు ఏవో టాబ్లెట్ వేసుకోమని బలవంతం చేయడంతో విధిలేక టాబ్లెట్ వేసుకున్నానని ఆమె తెలిపింది.
టాబ్లెట్స్ వేసుకున్నాక తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బ్యాంక్ స్ట్రీట్ లో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అబార్షన్ చేపించాడని, అతనికి ఆసుపత్రి వైద్యులు సహకరించారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని, తనను మోసం చేసిన సిద్ధూ తో పాటు, ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ విషయం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అయితే గతంలో పలు నేరారోపణలు ఉన్న అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఈ సంఘటన జరగడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.