గతంలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ నేడు బనియన్ గ్యాంగ్.. దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు

ముగ్గురు వ్యక్తులు చేతిలో చెప్పులు పట్టుకొని బనియన్లు వేసుకొని గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగతనానికి తెగబడ్డారు.

Update: 2024-06-27 06:37 GMT

దిశ, కంది: ముగ్గురు వ్యక్తులు చేతిలో చెప్పులు పట్టుకొని బనియన్లు వేసుకొని గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగతనానికి తెగబడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఈ నెల 26 తెల్లవారుజామున చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న భారతి బాయి అనే వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పోగా, అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి బైకును చోరీ చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

గతంలో చెడ్డి గ్యాంగ్.. నేడు బనియన్ గ్యాంగ్..

దొంగతనాలకు పెట్టిందే పేరుగా చెడ్డి గ్యాంగ్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. ఆ గ్యాంగ్ పేరు చెబితేనే ప్రజల్లో వణుకు పుట్టేలా చేశారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం కాకుండా అడ్డొస్తే కిరాతకంగా హత్యలు కూడా చేసిన గ్యాంగ్ అది. అది మర్చిపోకముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలో బనియన్ ను ధరిస్తూ చేతిలో చెప్పులు పట్టుకొని ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి తెగుపడంతో ఇదెక్కడి గ్యాంగ్ అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్ కట్టుకోగా ఒక వ్యక్తి మాత్రం ముఖానికి ఏమి కట్టుకోలేదు. సిసి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు పక్కా ఇది ఇతర రాష్ట్రాల దొంగల ముఠా పనే అంటూ ఒక నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు.


Similar News