అక్రమ సంబంధం..బాలుడి కిడ్నాప్, ఆపై హత్య

తనతో అక్రమ సంబంధం నడుపుతున్న మహిళ వేరొకరితో

Update: 2024-08-14 14:11 GMT

దిశ,ఇటిక్యాల : తనతో అక్రమ సంబంధం నడుపుతున్న మహిళ వేరొకరితో అక్రమ సంబంధం నడుపుతోందన్న నెపంతో ప్రియురాలి కొడుకుని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేశాడు. ఈ సంఘటన ఇటిక్యాల మండల పరిధిలోని మునగాల గ్రామంలో చోటుచేసుకుంది. తనను కాదని వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతుందన్న నెపంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకొనుటకు ఆమె ఏడు సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన నిందితుడు. డీఎస్పీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన సమీరా బేగం, జమీర్ దంపతుల కుమారుడు షేక్ రఫీ మంగళవారం మధ్యాహ్నం 3:00 నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు రాత్రి పది గంటల సమయంలో ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో తమ కుమారుడు తప్పిపోయిన ట్లుగా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును ఆధారంగా చేసుకున్న పోలీస్ సిబ్బంది వారు అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తి మునగాల గ్రామానికి చెందిన మౌలాలిని బుధవారం విచారణ చేపట్టగా నిందితుడు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన వివరాలను స్వయంగా వివరించినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలను నిందితుడు మౌలాలి వెల్లడిస్తూ మునగాల గ్రామానికి చెందిన కాసింసాబ్  మూడవ కూతురు మాలన్ బీని తన వివాహం చేసుకున్నానని తమకు ముగ్గురు సంతానం ఉన్నారని అయితే తన సొంత బామ్మర్ది అయినా షేక్ జమీర్ భార్య సమీరా బేగంతో గత కొంతకాలం నుంచి అక్రమ సంబంధం నడుపుతున్నానని ఆ క్రమంలోనే ఆమెకు అప్పుడప్పుడు డబ్బు అందజేసే వాడినని తెలిపాడు.

గత ఆరు నెలల క్రితం షేక్ జమీర్ తన దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడని ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదని దానితోపాటుగా తన దగ్గర డబ్బులు తీసుకుని సమీరా బేగం వేరే వారితో అక్రమ సంబంధం నడుపుతున్న విషయాన్ని చాలా పర్యాయాలు ఆమెకు వద్దని చెప్పిన వినలేదని తెలిపాడు. దానిని మనసులో పెట్టుకొని ఆ కుటుంబానికి ఏ రకంగానైనా బాధ పెట్టాలని ఉద్దేశంతో సమీరా బేగం, షేక్ జమీర్ దంపతుల కుమారుడు షేక్ రఫీ వయస్సు ఏడు సంవత్సరాల ( 7 ) ఇంటి ముందు ఆడుకుంటున్న షేక్ రఫీని తన బైక్ పై ఎక్కించుకొని ఇటిక్యాల మండల పరిధిలోని శివనంపల్లి కందిచేను పక్కన గల ముళ్ళకంపలలో బాలుడు గొంతు పిసికి చంపి వేసినట్లు నిందితుడు మౌలాలి ఒప్పుకున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సంఘటన స్థలానికి అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి బాబు , ఇటిక్యాల ఎస్సై వెంకటేష్,కోదండపురం ఎస్సై స్వాతి, ఉండవెల్లి ఎస్ఐ తదితరులు చేరుకొని పరిశీలించి వివరాలను సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించిన బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.


Similar News