హైడ్రా పేరుతో మోసం..కటకటాలపాలైన ఫిజియోథెరపీ డాక్టర్
మీ నిర్మాణం కాలువ పై ఉందని బెదిరిస్తూ రూ.20 లక్షలు డిమాండ్
దిశ, సంగారెడ్డి : మీ నిర్మాణం కాలువ పై ఉందని బెదిరిస్తూ రూ.20 లక్షలు డిమాండ్ చేసి ఇవ్వకపోతే హైడ్రా కు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్న విప్లవ్ సిన్హా కటకటాలపాలయ్యాడు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన విప్లవ్ సిన్హా చేసిన మోసాన్ని బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ బండ్ల విప్లవ్ సిన్హా అమీన్ పూర్ లో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పని చేస్తున్నారు. ఇతని సొంత గ్రామం ఖమ్మం పట్టణం మరియు జిల్లా. గత ఏడు సంవత్సరాలుగా అమీన్ పూర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు.
అమీనపూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగా ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని, అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి, ప్రభుత్వ స్థలాల్లో, ఎఫ్.టీఎల్, బఫర్ జోన్ లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించి, వారిని ఎలాగైనా బెదిరిస్తే వారి వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకొని అతని ఇంటికి సోషల్ వర్కర్ ఆక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు. సామాజిక కార్యకర్త పేరుతో పాటు పలు మీడియా సంస్థల నుంచి తాను రిపోర్టర్ అని చుట్టుపక్కల ప్రాంతాల్లో, చెరువులు, కుంటలకు ఆనుకొని మరియు ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇల్లు కడితే అట్టి ఇంటి యజమానులు, బిల్డర్ల వద్దకు వెళ్లి వారిని బెదిరించి, వారి గురించి పేపర్ లో రాయిస్తాను అని కలెక్టర్, రెవెన్యూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడన్నారు.
నాలా పేరుతో బెదిరింపులు..
గత కొంత కాలంగా నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా నివాసం ఉండే సాయి విల్లాస్, ఫ్యూజన్ స్కూల్ వెనకాల అమీన్ పూర్ చెరువు నుండి వచ్చే నాలా కు అనుకొని ఎంసీఓఆర్ ప్రాజెక్టు ఎల్ఎల్పీ పేరుతో ఒక పెద్ద నిర్మాణ సంస్థ విల్లా నిర్మాణాలు చేస్తుండగా అట్టి ప్రాజెక్టుకు వెళ్లేదారి అమీన్పూర్ చెరువు మధ్యలో నుండి వెల్తుంది. నిందితుడు ఆ వ్యక్తుల వద్దకు వెళ్లి మీరు వేసిన రోడ్డు నాలా ప్రవాహానికి అడ్డు వస్తుంది, ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. ఆగస్టు 14వ తేదీన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ కు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి నిందితుడు ఎంసీఓఆర్ ప్రాజెక్టు ఎల్.ఎల్.పి. రాజేందర్ కి వాట్స్ అప్ కాల్ చేసి వారి ప్రాజెక్టు పక్కన గల ఇరిగేషన్ నాలా గురించి కలిసి మాట్లాడాలని చెప్పగా అందుకు అతను సరే అన్నాడు. ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం పిస్తా హౌస్, అశోక్ నగర్ దగ్గర కలుద్దాం అని వాట్స్ అప్ ద్వారా మెసేజ్ చేశాడు. అతను దానికి అంగీకరించి ఆ రోజు కలవడం జరిగిందన్నారు. అక్కడ నిందితుడు హైడ్రా రంగనాథ్ తో దిగిన ఫోటోస్ చూపించి, రంగనాథ్ కి చాలా దగ్గర అని, అమీన్ పూర్ గురించి ఏదైనా నన్నే అడుగుతాడు అని చెప్పి, ప్రాజెక్టు జోలికి రావోద్దు అంటే నాకు రూ.20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి, చివరగా 16 లక్షలలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడని ఎస్పీ తెలిపారు.
దానికి గాను నేను వారికి అన్ని రకాలుగా సహాయంగా ఉంటానని లేకపోతే రోజు న్యూస్ పేపర్ లలో తప్పుగా రాయిస్తానని బెదిరించాడు. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వాట్స్ ఆప్ ద్వారా మెసేజ్ లు చేశాడు. ఆ తరువాత మళ్ళీ ఆగస్టు 25వ తేదీన గచ్చిబౌలి టీఎన్.జీఓ కాలనీ నందు ఆప్రికాస్ కాఫీ హౌస్ నందు కలుద్దాం అనగా ఆరోజు అక్కడ అతను, పార్టనర్ తో వచ్చి కలిశాడు. ఆ రోజు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే రోజు పేపర్ లో ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేయిస్తానని, అదే విధంగా హైడ్రా కు ఫిర్యాదు చేస్తానని, డబ్బులు ఇస్తే పేపర్ లో రాకుండా మరియు హైడ్రా ఏమి చేయకుండా చూసుకుంటానని బెదిరించాడు.
ఈ నెల 3వ తేదీన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు..
ఈ నెల 3వ తేదీన రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి మరియు మరొక ఇద్దరు కలిసి నిందితుడు బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వచ్చి అతను అడిగిన డబ్బులలో రాజేంద్రనాథ్ రూ.2 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇవ్వగా, డెకాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్, అమీన్ పూర్ పోలీస్ వారు అట్టి డబ్బుతో సహ నిందితున్ని పట్టుకొని, క్రైమ్ నెంబర్ 563/2024 సెక్షన్ 308 (5) బి.యన్.యస్. ఆక్ట్ ప్రకారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, నిందితున్ని రిమాండ్ కు పంపించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎవరైనా హైడ్రా పేరుతో, బెదిరింపులకు పాల్పడితే ఆ వ్యక్తుల గురించిన సమాచారాన్ని నేరుగా నా నంబర్ 8712656777 కు ఫోన్ ద్వారా గాని వాట్స్ అప్ ద్వారా గాని సమాచారం అందించాలని, ఆ వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ.ఎ.సంజీవరావు, అమీన్ పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేశం, యస్. బి. ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.