హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఐదుగురు స్మగ్లర్స్ అరెస్ట్..!

రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకంపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Update: 2024-06-12 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకంపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం మాత్రం అదుపులోకి రావడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. తాజాగా నగరంలోని బహదూర్‌పూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురిని నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ.4 లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని సయ్యద్ ఫైసల్‌గా గుర్తించారు. నిందితుడు ఫైసల్‌పై గతంలో కూడా డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి డ్రగ్స్ కొన్న 19 మంది కస్టమర్ల వివరాలను పోలీసులు గుర్తించారు. త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News