అత్యాశే వారిని కటకటాలపాలు చేసింది...

సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-08-23 15:50 GMT

దిశ, యాచారం : సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి, ఏసీపీ కేవీపీ రాజు కు వచ్చిన కీలక సమాచారం మేరకు వీరిని పట్టుకున్నారు. గురువారం సీఐ శంకర్ కుమార్ ఆధ్వర్యంలో మాల్, చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టగా వీరు పట్టుబడ్డారు. ఈ ముఠా నుండి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో కేవీపీ రాజు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా కొర్ర బాబు రావు, అల్లంపుట్టు గ్రామం, హుకుంపేట మండలం, బురుండి కామేశ్వర్ రావు బోడిగూడ గ్రామం, దుమిరిగూడ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, షేక్ మస్తాన్ వలీ, గోపాలపట్నం, విశాఖపట్నం, దుడ్డు మల్లేశ్వర్ రావు, వెంకోజిపాలెం, విశాఖపట్నం, శ్రీనివాస్ నాయుడు, వేములపూడి గ్రామం, నర్సీపట్నం మండలం, గిరీష్, బెంగళూరు అనే ఆరుగురు ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు.

    సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలం, వేములపూడి గ్రామం నుండి బెంగుళూరుకు గంజాయిని సరఫరా చేస్తున్నారని, అందులో భాగంగా కొర్ర బాబు రావు, బురుండి కామేశ్వర్ రావు, షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మల్లేశ్వర్ రావు కలిసి కిలో గంజాయికి 5 వేల చొప్పున 60 కిలోల గంజాయిని 3 లక్షలకు శ్రీనివాస్ నాయుడు, వద్ద కొనుగోలు చేసి బెంగళూరులో ఉంటున్న గిరీష్ కు కిలోకు పదివేలకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిని కారులో 3 సంచులలో వేసుకొని నాగార్జునసాగర్ హైవేపై ప్రయాణించి సులువుగా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ఖమ్మం, మిర్యాలగూడ, మల్లేపల్లి, మీదుగా ప్రయాణించి మాల్ చెక్పోస్ట్ వద్ద పట్టుపడ్డారని వివరించారు. షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మల్లేశ్వర్ రావు పోలీసులను చూసి తప్పించుకున్నారని, ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ నాయుడు, గిరీష్ పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి కారు, 60 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న యాచారం పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్. శంకర్ కుమార్, ఎస్సై యు. మధు, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Tags:    

Similar News