హ్యాక్ -ఐ, TG కాప్ యాప్ హ్యాకింగ్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఊపీరి పీల్చుకున్న పోలీసులు..!

తెలంగాణ పోలీసులకు సంబంధించిన హాక్-ఐ, టీఎస్ కాప్ యాప్‌లను హ్యాక్ చేసిన వ్యక్తిని శనివారం ఢిల్లీలో అరెస్టు చేసినట్లు డీజీపీ రవిగుప్తా

Update: 2024-06-09 16:31 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ పోలీసులకు సంబంధించిన హాక్-ఐ, టీఎస్ కాప్ యాప్‌లను హ్యాక్ చేసిన వ్యక్తిని శనివారం ఢిల్లీలో అరెస్టు చేసినట్లు డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుబడ్డ నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకువస్తున్నట్లు తెలిపారు. అరెస్టైన నిందితుడు గతంలో ఇదే తరహా సైబర్ నేరానికి పాల్పడి అరెస్టు అయ్యినట్లు రవిగుప్తా పేర్కొన్నారు. ఈ యాప్‌ల ద్వారా ఏలాంటి ఆర్ధిక పరమైన, రహస్య సమాచారం ఏమాత్రం బయటికి వెళ్ళలేదని డీజీపీ స్పష్టం చేశారు. హ్యాక్-ఐ, టీఎస్ కాప్, ఎస్ ఎమ్ ఎస్ సర్వీసెస్ యాప్‌ల హ్యాకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులపై టీజీసీఎస్‌బీ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. నిందితుడిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరమైన టూల్స్‌ను ఉపయోగించి నిందితుడు అమ్మకానికి పెట్టిన databreachforum.st ద్వారా హ్యాక్ చేసిన సమాచారాన్ని మొత్తం 150 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తానని వాటిని టెలిగ్రామ్ యాప్‌లో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అతని గుర్తింపును తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు హ్యాకర్ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అతనిని శనివారం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు గతంలో ఆధార్ కార్డు కు సంబంధించిన కీలక డేటా, ఇంకా అనేక ఏజెన్సీల సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది హ్యాకింగ్ కేసుకు సంబంధించి ద్వారక పోలీసు స్టేషన్ పోలీసులు అధికారులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసిందని డీజీపీ వివరించారు. ప్రాథమికంగా ఈ యాప్‌లు హ్యాకింగ్‌కు గురి కావడానికి పాస్ వర్డులు బలహీనంగా ఉండడంతోనే హ్యాకర్ సులభంగా హ్యాక్ చేయగలిగాడని అనుమానిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ యాప్‌ల నుంచి ఏలాంటి రహస్య సమాచారం గాని, ఆర్ధిక పరమైన విషయాలకు చెందిన డేటా హ్యాకింగ్‌కు గురి కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కాబట్టీ దీనిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని డీజీపీ చెప్పారు. ఈ తప్పుడు ప్రచారాల పై నిరంతరం నిఘా పెట్టామన్నారు. హ్యాకింగ్ గురైన గంటల్లోనే ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించి నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా పని చేసిన పోలీసు ఉన్నతాధికారులు శిఖా గోయెల్, భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, కేవిఎం ప్రసాద్, డి.సంపత్ కుమార్, అశిష్ రెడ్డి, సురేష్ లను డీజీపీ రవిగుప్తా అభినందించారు. ఈ నిందితుడి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ రవిగుప్తా చెప్పారు.


Similar News