‘‘నో మీన్స్ నో’’

by Shyam |
‘‘నో మీన్స్ నో’’
X

దిశ, వెబ్‌డెస్క్: ముగ్గురు యువతులు ఉద్యోగాలు చేసుకుంటూ స్వతంత్రంగా ఫరీదాబాద్‌లో జీవనం నివసిస్తుంటారు. ఆధునిక వేషధారణ, పద్ధతుల్లో ఉన్న వారు వారికి నచ్చినట్టు తమ పనులు చేసుకుంటూ ఉంటారు. ఓ రోజు మరో ముగ్గురు మిత్రులు(మగ)వారితో కలిసి పార్టీకి వెళ్లి, అక్కడ మద్యం తాగుతారు. పార్టీ మధ్యలో ఓ యువతి(తాప్సీ)ని ఒకడు అత్యాచారయత్నం చేస్తాడు. అది ప్రతిఘటించేందుకు ఆమె బీర్ బాటిల్‌తో వాడి తల పగులగొడ్తుంది. దాంతో రాజకీయ పలుకుబడి ఉన్న ఆ యువకుడు కక్ష సాధింపు చర్యలు(వేశ్యలుగా చిత్రీకరణ, పోలీస్ స్టేషన్‌లో కేసులు, వెబ్ సైట్లలో వారి ఫొటోల ప్రదర్శన) చేపడ్తాడు. అప్పుడు ఆ యువతులకు అండగా..‘‘నో మీన్స్ నో’’ అంటూ.. అత్యాచారయత్నం చేసేందుకు వచ్చిన యువకుడితో మై క్లైంట్ సెడ్ నో యువరానర్ అంటూ కోర్టులో వకీలుగా(అమితాబ్ బచ్చాన్) వాదించి సాధించిన విజయం ‘పింక్’ (2016). ఆధునిక పద్ధుతుల్లో యువతుల వస్త్రధారణ, వారు పబ్‌లు, పార్టీలకు వెళ్లినంత మాత్రాన వాళ్లకు శీలం లేదనుకోవద్దనీ, వారిని ఏదైనా చేయొచ్చని పురుషులు భావించడం చాలా పెద్ద తప్పని చెప్పడం.. పురుషాధిక్య భావన సరికాదనడం.. యువతులు పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్నది తప్పని చెప్పడం.. ఇదమిద్ధంగా ఇది చిత్ర సారాంశం..
ఈ కోర్టు డ్రామాను తమిళ భాషలో హీరో అజిత్ కుమార్ రిమేక్ చేయగా, తెలుగులో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా తొలిపాట ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. మే లో ‘వకీల్ సాబ్’ రిలీజ్ కానుంది.

నీడ్ ఆఫ్ ది హవర్..
రోజూ మీడియా, పేపర్లలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార వార్తలు కనబడుతున్నాయి. నిర్భయ, దిశ చట్టాలున్నా అమానుషాలు జరగడం ఆందోళన కలిగిస్తోందనీ పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చట్టాలు తెచ్చినంత మాత్రాన అఘాయిత్యాలు ఆగవనీ, మహిళలపట్ల సమాజదృష్టి, దృక్కోణం మారాల్సిన అవసరముందని అప్పుడు మహిళాసాధికారిత, దాడులు తగ్గే అవకాశముండొచ్చని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అప్పడెప్పుడో ఓ రాజకీయ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఖుషీ సినిమా చేసిన తర్వాత ఓ సమావేశంలో అభిమానులతో అమ్మాయిలను ఏడ్పించడం తప్పుఅని చెప్పినప్పుడు తనతో ఎవరూ ఏకీభవించలేదని, దాంతో తాను రాజకీయాల్లోకి వస్తేనే మార్పు తీసుకురావొచ్చని భావించానని, అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. అయితే, ‘కొమరం పులి’ చిత్రంలో మహిళల గురించి మాట్లాడే ఓ పోలీసు అధికారి పాత్ర పవన్ పోషించారు. ఇప్పుడు మహిళల సమస్యలు, ఆధునికత వంటి అంశాలపై మాట్లాడే వకీల్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా మహిళల పట్ల చూపాల్సిన గౌరవాన్ని, చూసే కోణాన్ని పవన్ మార్చగలిగి సామాజిక సందేశాన్ని ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా తన అశేష అభిమానులకు, యువతకు చేర్చగలిగితే మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయవాసం నుంచి సినీవాసం..
అజ్ఞాతవాసి తర్వాత సినిమాల్లో కనిపించని పవన్ రాజకీయ వాసం తర్వాత తిరిగి సినీవాసం చేస్తున్నారు. సినిమా, నిజజీవితంలో మహిళలపట్ల పవన్ గౌరవం ప్రదర్శిస్తారని ఆయన అభిమానులు చెబుతుంటారు. అందుకే ఆయన చిత్రాల్లో కొన్నింటికి మహిళా ఇతివృత్తంగా ఉండే టైటిల్స్ ఉంటాయంటుంటారు. ఉదాహరణకు గోకులంలో సీత, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది.. చిత్రాలు అని చెబుతారు. ఇటీవల కర్నూల్‌లో సుగాలి ప్రీతి అనే అమ్మాయిపై అత్యాచారం జరిగితే నిందితులు తప్పించుకుతిరుగుతున్నారని వారిని పట్టుకోవాలని, కేసును సీబీఐకి అప్పగించాలని జనసేన ఆధ్వర్యంలో పవన్ పోరాటం చేశారు. ప్రభుత్వం స్పందించి సీబీఐకి కేసు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువత సామాజికంగా విచ్చలవిడితనానికి అలవాటై పెడధోరణులకు బానిస కాకుండా మహిళలు వారి భద్రతపట్ల శ్రద్ధ చూపేలా ‘వకీల్ సాబ్’ సినిమా సందేశం ఉంటే.. అది అభిమానులకు చేరువ అయితే పవన్ చాలామంచి పని చేసినట్టేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి రావడం ద్వారా పవన్‌కు సినిమా ఇమేజ్ ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదని అభిమానులు చెబుతుంటారు. ‘‘మార్పు అనివార్యమైనప్పుడు కొనకొమ్మలకు మందేస్తే సరిపోదు చెదలు పెట్టిన చెట్టును కుదురు మెదళ్లతోసహా పెకలించాలి’’ అని ఓ కవి అన్నట్టు మహిళలు, యువతులను సినిమాల్లో చూపించే కోణం మారాలనీ, హీరో అంటే తప్పక హీరోయిన్‌ను టీజ్ చేయాలనే సంప్రదాయానికి చెక్ పెట్టాలని కొందరు కోరుతున్నారు. అయితే, వకీల్‌సాబ్ చిత్రంలో కాన్సెప్ట్‌కే ప్రాధాన్యమివ్వాలనీ, హీరోయిజాన్ని పెంచి.. కాన్సెప్ట్ మరువొద్దని, అప్పుడే సినిమా హుందాగా ఉండి, పవన్‌కు విజయం సులభతరమవుతుందని పలువురు పరిశీలకులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story