బెంగాలీలు మార్పు కోరుకుంటున్నారు: అమిత్ షా

by Shamantha N |
బెంగాలీలు మార్పు కోరుకుంటున్నారు: అమిత్ షా
X

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. దీదీ హయాంలో రాష్ట్రంలో హింసా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, అవినీతి రంకెలు వేస్తున్నదని ఆరోపించారు. టీఎంసీ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని, తమ ర్యాలీకి పోటెత్తుతున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వారు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని హామీనిచ్చారు. కేవలం ఐదేళ్లలో బెంగాల్ ప్రతిష్టను పునరుద్ధరిస్తామని, స్వర్ణ బెంగాల్‌గా మారుస్తామని అన్నారు. బెంగాల్‌లో రెండో రోజు పర్యటనలో కేంద్ర హోం మంత్రి బోల్‌పూర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగాయని, కనీసం 300 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. దాడులతో బీజేపీని నిలువరించగలమని టీఎంసీ తప్పుగా భావిస్తున్నదని అన్నారు. జేపీ నడ్డా కాన్వయ్‌పై దాడిని ఖండించారు. దీదీ పాలనలో రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లు ఆగవని, సంతుష్టివాదంతో టీఎంసీ మైనార్టీలను బుజ్జగించే రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతునిస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారని, కానీ, రాష్ట్రంలోని కర్షకులకు మాత్రం కేంద్రం ప్రకటించిన పథకాల ఫలాలు అందకుండా చేస్తున్నదని మండిపడ్డారు.

ఠాగూర్‌కు నివాళి
కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఉదయం శాంతినికేతన్‌లోని విశ్వ భారతి యూనివర్సిటీని సందర్శించారు. రబీంద్ర భవన్‌లో రబీంద్రనాథ్ ఠాగూర్‌కు పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు. రబీంద్రనాథ్ ఠాగూర్ కేవలం భారత సాహిత్యం, తాత్వికత అభివృద్ధిలో పాలుపంచుకోవడమే కాదు, భారత సంస్కృతి ఇతర దేశాలకు వ్యాపించడానికి శాంతినికేతన్ వేదికను నిర్మించారని కొనియాడారు. బెంగాలీ కళాకారుల ఇంట మధ్యాహ్నం భోజనం చేశారు.

Advertisement

Next Story

Most Viewed