త్వరలో హుజూరాబాద్‌కు అమిత్ షా

by Sridhar Babu |   ( Updated:2021-07-14 20:39:59.0  )
Huzurabad ByPoll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా ను ఆహ్వానించింది. ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన తర్వాత ఒక రోజు వస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధమేనని చెప్పినా వీలైనంత త్వరలోనే షెడ్యూలు రావచ్చని సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ ఖరారు అయిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వచ్చే నెల 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభించే పాదయాత్రలో సైతం అనువైన తేదీలో పాల్గొననున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చారు.

హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే తేదీకి అనుగుణంగా అమిత్ షా తన పర్యటనను ఖరారు చేయనున్నారు. ఆగస్టు చివరికల్లా పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసే బహిరంగ సభకు రావాల్సిందిగా ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన భేటీ అయ్యారు. హుజూరాబాద్‌లోని తాజా రాజకీయ పరిస్థితులను అమిత్ షా కు వివరించారు. తప్పకుండా వస్తానని ఈటల రాజేందర్‌కు హామీ ఇచ్చారు.

బండి సంజయ్ ప్రారంభించే పాదయాత్ర సందర్భంగా కూడా అనువైన తేదీలో హాజరుకావడానికి అమిత్ షా సమ్మతించారు. అమిత్ షా తో ఈటల భేటీ సందర్భంగా బండి సంజయ్, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు కూడా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. ఇంతకాలం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ ఇటీవల హర్యానా గవర్నర్‌గా బదిలీ కావడంతో గురువారం చండీగఢ్‌లో చేపట్టనున్న పదవీ బాధ్యతల కార్యక్రమానికి జితేందర్ రెడ్డి, వివేక్, ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతున్నారు.

Advertisement

Next Story