- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో వామపక్ష తీవ్రవాద సంస్థల్లో మావోయిస్టు పార్టీ బలంగా ఉందని, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై ప్రధాన దృష్టి పెట్టాలని, ఇకపైన రాష్ట్రాల తక్షణ టాస్కుగా అదే ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తీవ్రవాద సంస్థలకు ఏ రూపంలో సాయం చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే సమయంలో ఆ మార్గాలను మూసేయడానికి అవలంబించిన విధానాలను కూడా రూపొందించుకోవాలని సూచించారు.
వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోనిదే అభివృద్ధి సాధ్యం కాదని, అభివృద్ధి చర్యల ద్వారానే మావోయిస్టు చర్యలను నిర్మూలించవచ్చని స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో ఆదివారం జరిగిన సమావేశంలో తాజా పరిస్థితులను విశ్లేషించడంతో పాటు రానున్న ఏడాది కాలానికి భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు జరిగింది. దశాబ్దాలుగా ఉన్నమావోయిస్టు కార్యకలాపాలు గత కొన్నేండ్లుగా అడ్డుకోగలిగినా.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి పోరులో కీలక దశకు చేరుకున్నామని, మరింత తెగువ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు.
తెలంగాణ, ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల తరపున ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకాగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ తరపున ఉన్నతాధికారులు, డీజీపీ తదితరులు హాజరయ్యారు. ఉదయం మొదలు సాయంత్రం వరకు జరిగిన చర్చలో కొన్ని రాష్ట్రాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో వచ్చిన ఫలితాలు, ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, ఇకపైన చేయాలనుకుంటున్న కార్యాచరణకు సంబంధించిన అంశాలను వివరించాయి.
నిధులకు ఢోకా లేదు
ఒకప్పుడు మావోయిస్టు సమస్య, దాని వెన్నంటి ఉండే శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేదని, ఇప్పుడు కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించినందువల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే లొంగుబాటు చర్యలను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు ఆయుధాలను వదలకుండా యుద్ధం అనే విధానంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులను సమకూరుస్తుందని, అవసరమైన అదనపు బలగాలను కూడా ఇస్తున్నదని, ఇకపైన రాష్ట్రాలు పూర్తిస్థాయిలో ఫలితాలు రాబట్టడంపైనే దృష్టి పెట్టాలన్నారు. రానున్న ఏడాది కాలంలో వీలైనంత ఎక్కువ స్థాయిలో వామపక్ష తీవ్రవాద సమస్య లేకుండా చేయడంపై రాష్ట్రాలు ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
రాష్ట్రాలపై ఆర్థిక భారం వేయకుండా మొత్తం కేంద్రమే భరిస్తున్నందున ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 2,900 కోట్ల మేర ఉపశమనం లభించిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, హింసాత్మక చర్యలు కూడా తగ్గుముఖం పట్టాయని, అమాయకులు చనిపోవడం కూడా తగ్గిందని, పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోవడం కూడా తగ్గిపోయిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అమలుచేస్తున్న జాతీయ పాలసీ, యాక్షన్ ప్లాన్ మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రభావిత జిల్లాల సంఖ్య 96 నుంచి దశలవారీగా తగ్గి ఇప్పుడు యాభైకు లోపు చేరుకున్నట్లు తెలిపారు. కేవలం 25 జిల్లాల్లో మాత్రమే నక్సలైట్ల హింస ఉన్నదని వివరించారు.
అభివృద్ధి మంత్రం
మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు లేకపోవడం, అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండడం ప్రధాన కారణంగా గుర్తించినందున గత నాలుగైదేళ్ళుగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం లాంటి మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాయని, ఇకపైన ప్రతీ గ్రామంలో విద్యా, వైద్య సౌకర్యాలను కూడా కల్పించడం ద్వారా ప్రజలను ఆ ప్రభావం నుంచి బైటపడేయవచ్చని అమిత్ షా సూచించారు. పోస్టాఫీసులు, బ్యాంకులను కూడా వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు టెలికమ్యూనికేషన్లను ప్రజలకు అందుబాటులోకి తేవడం, మొబైల్ టవర్లను నిర్మించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటికే 17,600 కి.మీ. రోడ్ల నిర్మాణం ప్రతిపాదనల్లో దాదాపు 9,300 కి.మీ. పూర్తయిందని, 2,343 మొబైల్ టవర్ల నిర్మాణంజ జరిగిందని, వచ్చే ఏడాదిలో మరో రెండున్నర వేల టవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 1789 పోస్టాఫీసులు, 1236 బ్యాంకులు, 1077 ఏటీఎంలు, 14,230 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగంలో ఉన్నాయని, త్వరలో మరికొంత మెరుగవుతుందన్నారు. మూడేళ్ళ క్రితం మొత్తం 126 జిల్లాల్లో మావోయిస్టుల హింస సుమారు 85%కు పైగా ఉంటే ఇప్పుడు అది కేవలం పాతిక జిల్లాలకు మాత్రమే పరిమితమైందన్నారు.
నిరంతరం సమీక్ష జరగాలి
మావోయిస్టు కార్యకలాపాలను అణచివేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇచ్చిందని, అయితే ఇప్పుడు సాధించిన ఫలితాలతోనే సంతృప్తి చెందితే సరిపోదని, ఇకపైన అసలైన పోరు సలపాల్సి ఉన్నదని అమిత్ షా నొక్కిచెప్పారు. నిరంతరం ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరగాలని, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల నుంచి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే క్రింది స్థాయిలో దానికి తగిన ఆచరణ ఉంటుందని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి కనీసంగా ఇలాంటి సమీక్షలు జరగాలని నొక్కిచెప్పారు.