ఉమెన్ ట్రాఫికింగ్‌పై ‘అమల’ కథ..

దిశ, వెబ్‌డెస్క్: కడిగిన ముత్యం లాంటి ‘అమల’.. మురికి కూపం లాంటి వ్యభిచార రొంపిలోకి ఎలా నెట్టివేయబడింది? అందని జాబిల్లి లాంటి అందమైన అమల.. పైసలిచ్చే ప్రతీవాడికి ఎందుకు అందుబాటులో ఉండాల్సి వచ్చింది? తల్లిదండ్రులను కోల్పోయినా సరే, తన కాళ్ల మీద తను నిలబడిన అమ్మాయి.. ప్రతీ ఒక్కరికీ పడక సుఖం అందిస్తూ ప్రాణమున్న నిర్జీవిలా ఎందుకు బతకాల్సి వచ్చింది? అసలు ఆ పరిస్థితికి కారణం ఎవరు? అనేది తమిళ్ షార్ట్ ఫిల్మ్ ‘అమల’ కథ.

ఉమెన్ ట్రాఫికింగ్ గురించి అవగాహన కల్పిస్తూ.. కేవలం పదకొండు నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్.. మనలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. జీవితంలో ఏదో ఒక వెలితితో బాధపడుతున్న అమ్మాయిల బలహీనతలనే బలంగా మార్చుకున్న మాఫియాలు.. ప్రేమ, పెళ్లి పేరుతో టార్గెట్ చేసి ఇంత ఘోరానికి ఒడిగడుతున్నాయా? అనిపిస్తుంది. అసలు అమల అనే అమ్మాయి బలహీనత ప్రేమేనా? చిన్ననాటి నుంచి ఎవరి ప్రేమకు నోచుకోలేని అమ్మాయి.. కొంచెం ప్రేమ పంచగానే ముందు వెనక ఆలోచించకుండా గుడ్డిగా నమ్మితే ప్రేమికుడు ఏం చేశాడు?. ప్రియుడు కాల సర్పంలా కాటేస్తే తను ఎక్కడికి చేరుకుంది? ఎలాంటి నరకం అనుభవించింది?

అమల అనే యువతి జీవితం చుట్టూ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యూజికల్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను బి. గోవింద్ రాజ్, వినీత్ సంతోష్ డైరెక్ట్ చేశారు. పీఎస్. జయహరి అందించిన రొమాంటిక్ మ్యూజిక్‌కు తోడు అమేజింగ్ కెమెరా వర్క్, సూపర్ స్టోరీ, అంతకు మించి టేకింగ్ అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. అప్పటి వరకు రొమాంటిక్‌గా సాగిన లవ్ స్టోరీ.. ఒక్కసారిగా క్రైమ్ థ్రిల్లర్‌గా మారడం హైలెట్ అని చెప్తున్నారు ఆడియన్స్. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ మెచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్.. తన సోషల్ మీడియా స్టోరీస్‌లో షేర్ చేస్తూ అమల టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Advertisement