వైరస్‌లు లేకుండా జీవనం కష్టమే!

by Shyam |
వైరస్‌లు లేకుండా జీవనం కష్టమే!
X

ఇప్పటికిప్పుడు కరోనా వైరస్‌ను అంతం చేసే అవకాశంతో పాటు ప్రపంచంలో వైరస్‌లే లేకుండా చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తే ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కానీ ఆ అవకాశాన్ని వాడుకుంటే ప్రపంచ వినాశనం రెండు రోజుల్లో జరిగిపోతుంది. వైరస్ రావడం వల్ల కొంతమంది చనిపోయి, ఎక్కువ మంది కోలుకుంటున్నారు. కానీ అవే వైరస్‌లు లేకపోతే ప్రపంచమొత్తం ఒకేసారి పదిరోజుల్లో అంతమైపోతుంది. 1918 ఇన్‌ఫ్లూయెంజా నుంచి ఇప్పటి వైరస్ వరకు.. ఈ కంటికి కనిపించని జీవుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారనేది నిజమే. కానీ అవే వైరస్‌లు ఉండటం వల్ల ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే వైరస్‌లు అనేవి లేకపోతే మానవాళి జీవనం చాలా కష్టం అని చెప్పొచ్చు.

భూమ్మీద వైరస్‌లన్నీ మానవాళికి ప్రమాదకరం కాదు. మేలు చేసే పాథోజెన్లు కూడా ఎన్నో ఉన్నాయి. ఫంగి నుంచి మొక్కల వరకు వైరస్‌లు లేకపోతే అసలు పోషణ అనేదే లేదు. జీవావరణాలను సమతుల్యం చేయడంలో ఈ పాథోజెన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోకు చెందిన వైరాలజిస్ట్ సుజానే లోపెజ్ షారెటన్ అంటున్నారు. అందరూ వైరస్‌లు కలిగించే నష్టాలనే చూస్తున్నారు కానీ, వాటి మంచిని గమనించడం లేదని సుజానే చెబుతున్నారు. ఆ విషయంలో పరిశోధనలు కూడా పెద్దగా జరగడం లేదని, కానీ ఇప్పుడిప్పుడే కొంతమంది శాస్త్రవేత్తలు వైరస్ చేయగల మంచి గురించి పరిశోధిస్తున్నారని ఆమె అన్నారు. భూమ్మీద ఎన్నిరకాల వైరస్‌లు ఉన్నాయనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నే? వాటిలో ఎన్ని వైరస్‌లు ప్రమాదకరమో కూడా తెలియదని పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైరస్ ఎకాలజిస్ట్ మార్లిన్ రూస్నిక్ అంటున్నారు.

జీవావరణానికి కీలకం

జీవావరణ సమతుల్యంలో వైరస్ ప్రాముఖ్యత తెలియాలంటే ముందుగా ఫేజెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మహాసముద్రాల్లో బ్యాక్టీరియా మీద దాడి చేసి, దాన్ని ఒక ఎరువుగా మార్చి సముద్ర మొక్కలకు ఉపయోగపడేలా చేయడంలో ఈ ఫేజెస్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జలావరణ వ్యవస్థకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. ఇక ఫేజెస్ లేకపోతే బ్యాక్టీరియా జనాభా విపరీతంగా పెరిగి సముద్ర జీవావరణం దెబ్బతింటుంది. ఒక్క సముద్ర ఆవరణ వ్యవస్థలో మాత్రమే కాకుండా ఇతర అన్ని వ్యవస్థల్లో అతిగా పెరిగి ఆధిక్యత చూపిస్తున్న జంతు, వృక్షజాతులను అంతం చేసి, ఆ వ్యవస్థను సమతుల్యం చేయడానికి వైరస్‌లు అవసరం. ఈ ప్రక్రియను ‘కిల్ ద విన్నర్’ అంటారని రూస్నిక్ తెలిపారు. అంటే వ్యవస్థలో విజేతగా నిలిచి ఇతర జాతులను ఎదగకుండా చేస్తున్న జాతులను అంతం చేయడానికి వైరస్ అవసరం. బహుశా మానవ వ్యవస్థ మీద అందుకే విజృంభిస్తోంది కాబోలు. రూస్నిక్, అతని బృందం చేసిన కొన్ని పరిశోధనల్లో వైరస్‌లు కొన్ని జీవరాశులకు ప్రత్యక్షంగా సాయం చేస్తాయని తెలిసింది. ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో ఒక ప్రత్యేకమైన గడ్డి ఎదగడానికి ఫంగస్ జాతికి చెందిన వైరస్ సాయం చేస్తోందని వారు కనిపెట్టారు. ఈ వైరస్ కారణంగా అక్కడి ఉష్ణోగ్రత తారతమ్యాలను ఆ గడ్డి తట్టుకోగలుగుతోందని వారు అంటున్నారు.

మానవులకు కూడా ముఖ్యమే

వైరస్‌లు సోకడం వల్ల మనుషులు జబ్బు పడతారనే తప్పుడు వాదనను కొన్ని ఉపయోగకర పాథోజెన్లు తోసిపుచ్చుతున్నాయి. ఉదాహరణగా జీబీ వైరస్ సీ అనే వైరస్‌ను చెప్పుకోవచ్చు. ఇది మానవ రక్తంలో ఉండే ఒక వైరస్. ఇది వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ వైరస్‌కు దూరపు చుట్టం. ఈ వైరస్ శరీరంలో ఉండటం వల్లే హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిన వారు ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. ఎబోలా వచ్చినవారిని కొద్దికాలం స్థిమితంగా ఉంచడానికి ఈ వైరస్ ఉపయోగపడిందని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్‌ల చికిత్సా లక్షణాన్ని 1920 దశకంలోనే వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పట్లో రష్యాల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు చికిత్స చేయడానికి ఇలా వైరస్‌లను ఎక్కించేవారట. దీనికి ఫేజ్ థెరపీ అని పేరు కూడా పెట్టారు. ఇదంతా ఎందుకు.. ఒక వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టాలంటే చనిపోయిన వైరస్ కావాలి కదా.. ఈ రకంగా చూస్తే వ్యాధిని సృష్టించిన వైరస్‌తోనే ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టే సదుపాయం కలుగుతుంది కాబట్టి ఇప్పటికైనా వైరస్‌లు చేసే మంచిని గుర్తుచేసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

Next Story