కరోనా కట్టడికి అన్ని వర్గాలు సహకరించాలి

by Shyam |

దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి అన్ని వర్గాలు సహకరించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ రవీందర్, ముస్లిం మత పెద్దలతో కోవిడ్-19 పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో వారి వివరాలు సేకరించామని, వారు నివసించే ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇప్పటికే ఆశా, ఏఎన్ఎం సిబ్బంది,పోలీసుల సహకారంతో సర్వే చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో మత పెద్దలు తప్పనిసరిగా సహకరించాలన్నారు. అనుమానితులుగా గుర్తించిన వారిని ఎంజీఎంలోని ఐసోలేషన్‌లో ఉంచినట్టు వివరించారు. వారికి సంబంధించిన మరో 143 మంది బంధువులను ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ ఆయుర్వేద బోధన ఆస్పత్రిలో క్వారంటైన్ లో ఉంచామన్నారు. రెండ్రోజుల్లో వారందరి నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. పోలీస్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ..ఈలాంటి విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు అందరూ చేయూత నివ్వాలన్నారు. ఎవరైనా వదంతులు, దుష్ప్రచారం చేసినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలకు వెనుకాడేది లేదని సీపీ హెచ్చరించారు.

Tags : corona, all people must cooperate, collector hanumanthu, lockdown

Advertisement

Next Story