అన్ని భవనాల్లో పాక్షిక కూల్చివేతలు

by  |
అన్ని భవనాల్లో పాక్షిక కూల్చివేతలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత పనులు బుధవారం ప్రత్యేక వ్యూహంతో జరిగాయి. రెండు భవనాలను మంగళవారమే పూర్తి స్థాయిలో కూల్చివేయగా బుధవారం మాత్రం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో అది విచారణకు వచ్చే సమయానికి ప్రతీ భవనంలో కొంత భాగాన్ని కూల్చేవేసే వ్యూహాన్ని అవలంబించారు అధికారులు. ‘ఎల్’, ‘జె’ బ్లాకులను దాదాపు పదిశాతం మేర కూల్చివేయగా పాతన భవనమైన ‘కె’ బ్లాక్‌ను మాత్రం దాదాపు పాతిక శాతం మేర కూల్చివేసినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం.

కూల్చివేత పనులు మొదలుపెట్టిన మొదటి రోజునే ‘సి’ బ్లాక్‌లో కొంత భాగాన్ని కూల్చివేశారు. ‘డి’ బ్లాక్‌లో పోర్టికోవైపు ఉండే భాగాన్ని కూల్చివేశారు. ‘హెచ్ నార్త్’, ‘హెచ్ సౌత్’ బ్లాకులను కూడా మంగళవారమే పాక్షికంగా కూల్చివేశారు. కానీ అప్పటివరకూ ముట్టుకోని భవనాలన్నింటినీ మంగళవారం కనీసంగా పది శాతం చొప్పున కూల్చేసినట్లు తెలిసింది. హైకోర్టులో దాఖలైన ‘పిల్’పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని భావించిన అధికారులు అన్నింటి కూల్చివేత మొదలైందని చెప్పేందుకు వీలుగా ఏ ఒక్క భవనాన్నీ వదలిపెట్టకుండా అన్నింటినీ పాక్షికంగా కూల్చివేశారు.

అత్యవసర పిటిషన్‌గా విచారించలేం: హైకోర్టు

సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని కోరుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధాఖలు చేశారు. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున వాటిని ఉల్లంఘించే తీరులో భవనాల కూల్చివేత పనులు జరుగుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. భవనాలను కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఆ చుట్టుపక్కల ఐదు లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలికి కూల్చివేతల వలన ఆటంకాలు కలుగుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత జరుగుతోందన్నారు. ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని కోరారు. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది.


Next Story

Most Viewed