కరోనా టైం.. ప్లాస్మా డోనర్ @ ప్రాణదాత

by Anukaran |
కరోనా టైం.. ప్లాస్మా డోనర్ @ ప్రాణదాత
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆత్మస్థైర్యంతో పాటు ‘ఇమ్యూన్ పవర్’ చాలా ముఖ్యం. ఇది కరోనా విషయంలో అనే కాదు.. దేహంలోకి ఏ ఫారిన్ పార్టికల్ ఎంటర్ అయినా, రోగనిరోధక కణాలు వెంటనే అప్రమత్తమై వాటిని నాశనం చేస్తాయి. అందుకే కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాగా ‘ఇమ్యూన్ పవర్’ తక్కువున్న వారిలో రోగ నిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, వైరస్ బాధితుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ‘ప్లాస్మా థెరపీ’ అంటారు. ఈ బ్లడ్ ప్లాస్మా థెరపీ COVID-19 రోగులకు వెంటిలేటర్ అవసరం రాకుండా చేయడంలో సాయపడుతుంది. ఈ మేరకు ప్లాస్మా డోనర్స్‌కు డిమాండ్ పెరుగుతుండగా.. ప్లాస్మా ఎవరు డొనేట్ చేయొచ్చు? నిబంధనలు ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం.

బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్న 15-30 రోజుల తర్వాత, వారి శరీరంలోని రోగనిరోధక కణాల సంఖ్యను తెలుసుకునేందుకు వైద్యులు ‘ఎలీసా’ పరీక్ష చేస్తారు. ఈ కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో తెలుసుకోవడంతో పాటు ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాతే దాత నుంచి రక్తాన్ని సేకరిస్తారు. అయితే రోగనిరోధక కణాలు ప్లాస్మాలో మాత్రమే లభించనుండగా.. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మాను సేకరిస్తారు. ఈ వాల్యూమ్‌ను నలుగురు రోగుల(ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున)కు ఎక్కించవచ్చు.

మోడరేట్ లక్షణాలు ప్రారంభమైన ఏడు నుంచి 10 రోజులలోపు.. సెలెక్టెడ్ పేషెంట్స్‌కు మాత్రమే వైద్యులు ప్లాస్మా థెరపీని సిఫార్సు చేస్తారు లేదా సూచిస్తారు. ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న వారితో పాటు ఆక్సిజన్ స్థాయి మరీ తక్కువగా ఉండి, పరిస్థితి విషమించే స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది. అంటే రోగి సైటోకిన్ స్టార్మ్(సైటోకిన్లు సాధారణం కంటే చాలా ఎక్కువ రేటుతో ఉత్పత్తయ్యే స్థితి) రెండో, మూడో దశల మధ్య ఉన్న సమయంలో ప్లాస్మా థెరపీ చేస్తే ఫలితం ఉంటుందని, వ్యాధి చివరి దశలో ఈ చికిత్సా విధానం పనిచేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్మా దానం ఎవరు చేయొచ్చు?

COVID-19 నుంచి కోలుకున్న రోగి 15-30 రోజుల తర్వాత ప్లాస్మాను దానం చేయొచ్చు. డోనర్ (దాత) తప్పనిసరిగా ఆస్పత్రి/ప్లాస్మా బ్యాంక్ కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ సీరం ప్రోటీన్, సీబీసీ(కంప్లీట్ బ్లడ్ కౌంట్స్), ఏబీఓ ఆర్‌హెచ్‌డీ బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయించుకోవాలి. వాటితో పాటు హెపటైటిస్ బీ వైరస్, హెపటైటిస్ సీ వైరస్, హెచ్ఐవీ, మలేరియా, సిఫిలిస్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రోజుల సంఖ్య బట్టి, దాత కూడా ఐసీఎంఆర్ కిట్ పద్ధతి ప్రకారం యాంటీబాడీ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.

ఎలిజిబిలిటీ క్రైటీరియా :

* దాత తప్పనిసరిగా 50 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి.
* అతడు/ఆమె వయసు 18-60 మధ్య ఉండాలి
* అసింప్టమాటిక్ రోగులతో పోల్చితే.. కరోనా వచ్చినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారిలో SARS-Cov-2 IgG యాంటీబాడీస్ కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ లక్షణాలు లేని రోగుల్లో కూడా యాంటీబాడీస్ ఉంటే వారు కూడా ప్లాస్మా డొనేట్ చేయొచ్చు.

దాతగా అనర్హులు :

* ఇన్సులిన్ తీసుకునే డయాబెటిస్ బాధితులు.
* బీపీ లెవెల్స్140 కంటే ఎక్కువ, డయాస్టొలిక్ 60 కన్నా తక్కువ లేదా 90 కన్నా ఎక్కువ ఉన్నవారు. గత 28 రోజుల్లో జరిగిన ఔషధాల మార్పుతో అనియంత్రిత మధుమేహం లేదా రక్తపోటు వచ్చినవాళ్లు ప్లాస్మా డొనేషన్‌కు దూరంగా ఉండాలి.
* క్యాన్సర్ సర్వైవర్స్, క్రోనిక్ కిడ్నీ, హార్ట్, లంగ్, లివర్ డిసీజ్ ఉన్నవాళ్లు. ప్రెగ్నెంట్ మహిళలతో పాటు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు.
* కొవిడ్ వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు, రెండో డోస్ తీసుకున్న తేదీ నుంచి 28 రోజుల వరకు డొనేట్ చేయకూడదు.

ఎన్నిసార్లు ఇవ్వవచ్చు?

ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. ఒక దాత 15 రోజుల వ్యవధిలో, 500 మి.లీ వరకు ప్లాస్మాను (బరువు ప్రకారం) ఒకటి కంటే ఎక్కువసార్లు దానం చేయవచ్చు. 400 మి.లీ ప్లాస్మా రెండు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల (పరీక్షల నుంచి మార్పిడి వరకు)వరకు ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో డోనర్‌కు అసౌకర్యం కలిగితే, ప్రాసెస్ ఆపేయడం ఉత్తమం. ప్లాస్మాను నెలకు రెండు కంటే ఎక్కువసార్లు దానం చేయొచ్చు.

పుణె‌కు చెందిన పదో తరగతి విద్యార్థి విరాజ్ షా ‘జీవన్ రక్ష’ అనే ప్లాస్మా డోనర్ పోర్టల్ ప్రారంభించాడు. హాస్పిటల్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లతో పాటు బ్లడ్ బ్యాంకులు, టీకా కేంద్రాలు, ఐసోలేషన్ వార్డుల గురించిన కొవిడ్ రిలేటెడ్ సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా సిటీ, వయస్సు, లింగం, బ్లడ్ గ్రూప్ మరియు వారి కొవిడ్ -19 చరిత్ర ఆధారంగా దాతలను పొందవచ్చు. ప్లాస్మా దాతల వివరాలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లోని గౌదమ్ బుద్ధ నగర్ పోలీసులు ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించగా.. ‘ది బెటర్ ఇండియా’ వెబ్‌‌సైట్ నిర్వాహకులు కూడా ప్లాస్మా ఈ వివరాలను అందిస్తున్నారు. కాగా, ప్లాస్మా అవసరమైన వాళ్లు లేదా దానం చేయాలనుకునే వాళ్లు ఎవరైనా ‘donateplasma.scsc.in’లో నమోదు చేసుకోవచ్చు లేదా Ph: 9490617440పై సైబరాబాద్‌ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ సంప్రదించవచ్చని సైబరాబాద్, రాచకొండ సీపీలు వీపీ సజ్జనార్, మహేష్ భగవత్‌ వెల్లడించారు.

Advertisement

Next Story