బీ అలర్ట్: భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు…

by Anukaran |   ( Updated:2021-06-24 04:56:06.0  )
bhadrachalam temple
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలానికి వరద ముప్పు ఈసారి కూడా తప్పేట్టు లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేయడం తప్ప మరేమీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంపునకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ ఎప్పటికప్పుడు అందరూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆచరణకు మాత్రం సాధ్యం కావడం లేదు. పోలవరం నిర్మాణం వల్ల గత ఏడాది కంటే ఈసారి ఇంకా భద్రాచలానికి వరద ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతుండడం, వర్షాలు మొదలైతే మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశాలు అధికంగా ఉండడంతో ముంపు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈసారి నష్టం ఎక్కువే..

గతేడాది ఆగస్టు రెండో వారంలో గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి 61 అడుగులతో ప్రవహించింది. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం అసంపూర్తిగా ఉన్నప్పుడే పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు నిర్మాణం పూర్తయి కాపర్ డ్యాం పూర్తిగా మూసివేశారు. దీంతో స్పిల్ వే మీదుగా నీటిని మళ్లిస్తే గోదావరికి వరద ఉధృతి భారీగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎన్నో గ్రామాలు ముంపునకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. పోయిన సారి కంటే ఈసారి నష్టం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

పోలవలంతో పెరగనున్న ఉధృతి..

పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ఎప్పుడూ వరద ముప్పు ఉంటుందని నిపుణులు గతంలోనే పలు మార్లు హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాధారణ రోజుల్లోనే గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43 అడుగుల వరకు నీరు ఎప్పుడూ నిలిచి ఉంటుందని, అలాంటిది వర్షాకాలం వరదల సమయంలో నష్టం ఊహించడానికే భయంకరంగా ఉంటుందని తెలుస్తోంది. డ్యాం నిర్మాణం తర్వాత సాధారణంగా 50లక్షల క్యూసెక్యుల నీరు గరిష్టంగా నిల్వ ఉంటుందని, వరదల సమయంలో మరిన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని తెలుస్తోంది. ఇదే గనుక జరిగతే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ చర్యలేవీ..

ఈసారి వరదలు సంభవిస్తే భద్రాచలంతో పాటు, దుమ్ముగూడెం, బూర్గంపాడు, చర్ల, అశ్వాపురం, వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు పలు గ్రామాలు భారీగా ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని నీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు పడక ముందే ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమయి తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. వరద ముంపు నుంచి భద్రాచలాన్ని తప్పించేందుకు నగరం చుట్టూ కరకట్టల నిర్మాణం చేపట్టడంతో పాటు ఇప్పుడున్న కరకట్ట ఎత్తు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని అక్కడి నుంచే ముందుగానే తరలించాలని పలువురు సూచిస్తున్నారు. ఈసారి వరదలు వస్తే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది కాబట్టి, ముందుగానే సరిపడా పునరాస కేంద్రాలను ఏర్పాటుచేసి ఇప్పటినుంచే బాధితులను తరలించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ముంపు బాధితులు పునరావాసాలకు వెళ్లాలి..

ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ వర్షాలు బాగా వచ్చి, వరదలు సంభవించినప్పుడు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోయిన సంవత్సరం అధిక వర్షపాతం, పైనుంచి నదీ ప్రవాహం అధికంగా ఉండడం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. పోలవరం కాపర్ డ్యాం మూసివేశారని చెప్పిన ముంపు ప్రాంత వాసులు వినడం లేదు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లమంటే వరదలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణిలోనే ఉన్నారు. ఇది ప్రమాదకరం. ఒక వేళ అధికంగా వరదలు వస్తే ఉభయ గోదావరి జిల్లాలు, రంపచోడవరంతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
-రామ్‌ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం

Advertisement

Next Story

Most Viewed