అజేయ్ నగర్ టు కేబీసీ

by Shyam |   ( Updated:2020-11-05 06:39:05.0  )
అజేయ్ నగర్ టు కేబీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: నువ్వు ఎంత ఫేమస్ అవ్వాలనుకుంటున్నావ్? అని ఎవరినైనా అడిగితే ఎవరో ఒక గొప్ప వ్యక్తి పేరును చెబుతారు. వాళ్లు చేశారని అడిగితే వారి విజయాల గురించి ఏదో ఒక జెనరిక్ ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తుల జాబితాలో యూట్యూబర్ క్యారీ మినాటి కూడా చేరిపోయి, విజయం అంటే ఇది అని ఒక స్థిరమైన నిర్వచనం ఇచ్చాడు. నేటి తరానికి క్లారిటీ ఎక్కువ, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావ్ అంటే ఎవరో ఒకరి పేరు చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరూ క్యారీ మినాటి లాంటి విజయం సాధిస్తే చాలు అని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వారు మెచ్చుకోవడానికి క్యారీ ఏం చేశాడు? మళ్లీ ఎవరినైనా బూతులతో రోస్ట్ చేస్తూ కొత్త వీడియో పెట్టి ఉంటాడని అనుకోకండి. ఈసారి క్యారీ తనంతట తానుగా ఏం చేయలేదు, ఇన్నాళ్లు తను పడిన కష్టమే ఇప్పుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

హెడ్డింగ్‌లో అజేయ్ నగర్ అని పెట్టి, ఎవరో క్యారీ మినాటి గురించి మాట్లాడుతున్నారని అనుకోకండి. క్యారీ గురించి తెలిసిన వారందరికీ అతని అసలు పేరు అజేయ్ అని తెలుసు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఇదే ప్రశ్న అడిగారు. ‘ఏ యూట్యూబ్ స్టార్ అసలు పేరు అజేయ్ నగర్?’ అని అమితాబ్ బచ్చన్ అడిగారు. దీంతో క్యారీ మినాటీ ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో గర్వంగా ఫీలవుతూ స్టేటస్‌లు పెడుతున్నారు. ఇందులో గర్వంగా ఫీల్ అవడానికి ఏముందని అనుకోకండి. అదేంటో తెలిస్తే మీరు కూడా వీడు నిజంగా అజేయుడని అంటారు. అది తెలియాలంటే అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కొద్దిగా లోతుగా తవ్వాల్సి ఉంటుంది.

మే 21, 2020న అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టారు. అందులో ఆయన మనుమడు అగస్త్య నందాతో కలిసి జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నట్లు ఉన్నాడు. అగస్త్య నందా చూడటానికి కొద్దిగా క్యారీ మినాటి పోలికలతో కనిపించడంతో ‘మీరు క్యారీతో ఏం చేస్తున్నారు’ అని ఓ నెటిజన్, అమితాబ్‌ను ప్రశ్నించాడు. అందుకు అమితాబ్ ‘ఆ ఫొటోలో ఉన్నది నా మనుమడు అగస్త్య, మధ్యలో ఈ క్యారీ ఎవరు?’ అని ప్రశ్నించాడు. అలా అమితాబ్‌కే తెలియని స్థాయి నుంచి ఇవాళ అమితాబ్ నోట ప్రశ్నగా మారిన క్యారీ మినాటి పాపులారిటీని చూస్తే, ఆ పాపులారిటీ సంపాదించడానికి క్యారీ పడిన కష్టాన్ని పొగడకుండా ఉండలేమనిపిస్తోంది. ఏదేమైనా మోడర్న్ యువతకు మోడర్న్ ఇన్‌స్పిపిరేషన్ అంటే ఇదేనేమో!

Advertisement

Next Story