ఈ ఏడాదిలోనూ విమానయాన రంగం కోలుకోవడం కష్టమే'!

by Harish |
ఈ ఏడాదిలోనూ విమానయాన రంగం కోలుకోవడం కష్టమే!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా 2020లో దెబ్బతిన్న దాదాపు అన్ని రంగాలు రికవరీ వైపుగా సాగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. అయితే, విమానయాన, అతిథ్య రంగాలు మాత్రం కరోనా ప్రభావం నుంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితులు కనిపించడంలేదని తెలుస్తోంది. గతేడాది మిగిలిన రంగాల కంటే ఈ రెండు రంగాల్లోనే అత్యధికంగా ఉద్యోగాల నష్టం జరిగింది. ఇటీవల వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తేయడంతో పరిమితస్థాయిలో కొన్ని సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దేశీయంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న విమానయాన రంగం 2021లోనూ కోలుకునే సంకేతాలు కనిపించడంలేదని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏవియేషన్ కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆసియా-పసిఫిక్(సీఏపీఏ-కాపా) ఈ రంగం వికవరీ గురించి అంచనాలను మంగళవారం వెలువరిచింది. డిమాండ్ అనిశ్చితంగానే ఉందని, ముఖ్యంగా అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ 2021లోనూ డిమాండ్ అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చని తెలిపింది. 2019-20 అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 35-40 శాతం మాత్రమే కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయని, అదేవిధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎయిర్ ట్రాఫిక్ 70 శాతం వరకు కోలుకునే అవకాశాలున్నాయని కాపా పేర్కొంది. కరోనాకు పూర్వస్థాయికి చేరుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, కరోనా అంతరించి, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు ఇలాగే ఉంటుందని కాపా వివరించింది. అతిపెద్ద విమానాశ్రయాలు ప్రైవేటీకరించబడుతున్న సమయంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ దీర్ఘకాలిక వ్యాపార నమూనాను కలిగి ఉండటం అవసరమని కాపా వెల్లడించింది.

Advertisement

Next Story