కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు

by Shyam |
కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నివారణలో విఫలమై హైకోర్టుతో చివాట్లు తింటున్నా ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తు తప్పుడు లెక్కలు చూపుతోందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. దీనిపై గవర్నర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. కరోనా మరణాల తప్పుడు లెక్కల నమోదు ద్వారా ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పూర్తిగా తుంగలో తొక్కుతుందని లేఖలో స్పష్టం చేశారు. కొవిడ్ మరణాల నమోదుపై ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో సెక్షన్ 2.4 లో చాలా స్పష్టంగా ఉన్నాయని, ప్రతి కొవిడ్-19 పాజిటివ్ మరణాన్ని నమోదు చేయడం ప్రాముఖ్యతను వివరించారని, ఈ లెక్కల ఆధారంగానే కొవిడ్ లక్షణాలు, వ్యాప్తి, నివారణ, నియంత్రణ, చికిత్సపై అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రోజుకు దాదాపు వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తుంటే కేవలం 10లోపే చూపుతున్నారని, హైద్రాబాద్‌లోనే రోజూ 50మృతదేహాలను రహస్యంగా దహనం చేస్తున్నారని అన్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొవిడ్ మరణాలను దాయటం, మృతదేహాలను దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. డాక్టర్స్ ఫర్ సేవ వంటి అనేక సంస్థలే కాక, వివిధ వార్తా పత్రికలు, ఛానళ్లు, మరణించిన వ్యక్తుల బంధువులు అనేక రుజువులు బహిర్గతం చేశారని, అయినా ప్రభుత్వం పారదర్శకత చూపకపోవడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed