గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు మోక్షమెప్పుడో..

by Shyam |
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు మోక్షమెప్పుడో..
X

దిశ, మెదక్
సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మశ్రీరాంతో పాటు కాంగ్రెస్ నాయకులు జల దీక్షలో పాల్గొని నిరసన తెలిపారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం మరింత జాప్యం చేస్తుందంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినటువంటి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణం టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా వాటిని పూర్తి చేయకుండా..ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి పోలీసులు ఎక్కడికక్కడ ప్రయత్నించారు. అయినా హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కట్టపైకి చేరుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నియంతృత్వ ధోరణిని విడనాడి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి హుస్నాబాద్ పీఎస్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed