రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు

by Sridhar Babu |

దిశ , ఖ‌మ్మం: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆలోచించిన విధంగా ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. ప్రస్తుతం ఎవరి దగ్గర డబ్బులు లేవు..కేవలం రైతుల ఖాతాల్లోనే ఉన్నాయని, అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో రైతులు పండించిన పంటలను ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనిగోలు చేసి రైతుల పక్షాన నిలబడిందన్నారు. 3 రోజుల్లో కోటీ 33 లక్షల 77వేల ఎకరాలకు సంబంధించి 54.22 లక్షల మంది రైతులకు రూ.6,888.43 కోట్లు రైతు బంధు నిధులను ఖాతాలలో జమ చేశామన్నారు. ఒక్క మధిర నియోజకవర్గంలో దాదాపు ఒక పంట కోసం రూ.90 కోట్ల రైతు బంధు నిధులు ఇచ్చిందని, రెండో పంటకు మళ్ళీ రూ.90 కోట్లు ఇవ్వనుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, జెడ్పీ సీఈఓ ప్రియాంక, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed