వ్యవసాయరంగమే మెరుగ్గా ఉంది : ఫిక్కీ!

by  |
వ్యవసాయరంగమే మెరుగ్గా ఉంది : ఫిక్కీ!
X

దిశ, వెబ్‌డెస్క్: పరిశ్రమ సంఘాల సమాఖ్య ఫిక్కీ(ఎఫ్‌సీసీఐ) తన ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వేలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ సగటు జీడీపీ వృద్ధి -4.5 శాతంగా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంతో ఇంతకుముందు జనవరి నెలలో నివేదించిన 5.5 శాతం వృద్ధి అంచనాను తగ్గించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సుధీర్ఘ లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైనట్టు ఫిక్కీ అభిప్రాయపడింది. జూన్‌లో ఈ సర్వే వివరాలను సేకరించినట్టు, పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ‘ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వే’లో పాల్గొన్న ఆర్థిక వేత్తలు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా -4.5 శాతం ఉండగా, కనిష్ట అంచనా -6.4 శాతంగా ఉండొచ్చని, గరిష్టంగా 1.5 శాతమని ఫిక్కీ అభిప్రాయపడింది. ఆర్థిక కార్యకలాపాల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వృద్ధి 2.7 శాతంగా సూచించింది. ‘ప్రస్తుతం సానుకూల వృద్ధిని నమోదు చేస్తున్నది వ్యవసాయ రంగం మాత్రమే అని ఫిక్కీ వెల్లడించింది. అలాగే, 2020-21లో పరిశ్రమల రంగం వృద్ధి అంచనా 11.4 శాతం, సేవల రంగం 2.8 శాతం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బలహీనమైన డిమాండ్, తగ్గిన వినియోగ సామర్థ్యం కారణంగా ఈ రంగాలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వినియోగదారు వస్తువులు, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకున్నప్పటికీ అనేక కంపెనీలు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కార్మికుల కొరత, బలహీనమైన డిమాండ్ కంపెనీలకు ప్రధాన సమస్యగా ఉన్నట్టు పరిశ్రమ ఛాంబర్ అభిప్రాయపడింది.



Next Story