వరి నాట్లకు కూలీలు కరువు

by  |
వరి నాట్లకు కూలీలు కరువు
X

వానా కాలం సాగుకు కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రధానంగా వరి సాగులో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ కారణంగా పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీల కొరత ఏర్పడటంతో.. వరి సాగు పనులు ముందుకు సాగడం లేదు. నారుమడుల్లో వరి నాట్లు ముదిరిపోతున్నప్పటికీ.. నాట్లు వేయడానికి కూలీలు దొరక్క ఆదిలోనే రైతాంగం పడుతున్న ఇక్కట్లపై ప్రత్యేక కథనం..

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరత వేధిస్తోంది. కరోనా పుణ్యమా అని ఈ సమస్యల మరింత తీవ్రతరమైంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతోన్నాయి. జూన్‌లో మంచి వర్షాలు కురిసి సాధారణ వర్షపాతం నమోదు కావడంతో.. ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో జలకళ సంతరించుకోవడంతో.. కీలక పనులు శరవేగమయ్యాయి. తొలిసారి నియంత్రిత పంట సాగు విధానం అమల్లోకి వచ్చిన తరుణంలో.. ఈ వానా కాలంలో సన్న వరి రకాలు సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది.

ఒక్కసారిగా కూలీలకు పెరిగిన డిమాండ్..

వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడుతుండడంతో రైతులందరూ ఒకేసారి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికితోడు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలంతా వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీనికితోడు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలోనే పనిచేసుకోవాలని ఆయా గ్రామ పంచాయతీలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయ కూలీలకు కొరత ఏర్పడింది. ప్రధానంగా వ్యవసాయ పనులకు సంబంధించిన కూలీ పనులు చేసేందుకు చాలామందిలో నైపుణ్యం కొరవడింది. వాస్తవంగా నాట్లు వేసేవారు ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. వేరే పనులు చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉంటున్నా.. నాట్లు వేయరాని కారణంగా మనుషులు పనిచేసేందుకు రెడీగా ఉన్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి. ఫలితంగా నాట్లు వేసే మహిళలకు నిత్యం రూ.500పైగా కూలీ గిట్టుబాటు అవుతుండగా, ఒడ్డు, వరం చెక్కే మగవారికి అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. స్థానిక కూలీలు రాకపోవడంతో కొన్నిచోట్ల ఇతర జిల్లాలు, పొరుగు గ్రామాల నుంచి రవాణా ఛార్జీలు చెల్లించడంతోపాటు రోజుకు వెయ్యి రూపాయలు కూలీ ఇస్తామన్నా కూడా దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. వరి నాటు వేసే యంత్రాలు అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నా… యంత్రాల అద్దెలు భరించే స్తోమత రైతుల్లో లేకపోవడం కూడా పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. ఒక ఎకరం విస్తీర్ణంలో వరి పంట సాగు కోసం 30 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.

అదును దాటుతోంది..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూలీల సమస్య తీవ్ర రూపం దాల్చింది. యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నారు పోసి 45 రోజులు దాటిపోయినా నాటు వేసేందుకు కూలీలు దొరకడం లేదు. అది కాస్త ముదిరిపోతోంది. రేపు వస్తాం.. మాపు వస్తాం.. యూరియా చల్లి పెట్టమంటూ కూలీలు చెబుతున్నారు తప్ప వచ్చి నాట్లు వేయడం లేదంటే కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా కూలీల రేట్లు, ట్రాక్టర్ కిరాయిలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరుగుతుండటం వెరసి సాగు వ్యయం భారంగా మారుతోంది.

ఉపాధి హామీ పనిని అనుసంధానించాలి

ఎకరానికి 40 క్వింటాళ్లు వచ్చినా కనీస మద్దతు ధరల ప్రకారం పెద్దగా రాబడి ఉండటం లేదన్నది వాస్తవం. ముదిరిపోయిన ధీర్ఘకాలిక వరి రకం నారు ఆలస్యంగా నాటేసినా ఆశించిన దిగుబడి రాకపోవడం, దొడ్డు రకాల తరహాలో మద్దతు ధరలు లభించవని రైతులు వాపోయారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే.. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని యంత్రాలు సమకూర్చాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్ వస్తోంది.


Next Story

Most Viewed