హైదరాబాద్‌లో మళ్ళీ లాక్‌డౌన్?

by Anukaran |   ( Updated:2020-06-28 11:51:17.0  )
హైదరాబాద్‌లో మళ్ళీ లాక్‌డౌన్?
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా తయారు కావడంతో మరోమారు లాక్‌డౌన్ విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆంక్షల సడలింపుతో ప్రజల కదలికలు పెరిగాయని, వైరస్ వ్యాప్తి విస్తృతమైందని, దీన్ని అరికట్టడానికి లాక్‌డౌన్ తప్పదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగైదు రోజుల్లో తగిన వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే లాక్‌డౌన్‌కు అవసరమైన విధి విధానాలను రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ లోపు ప్రజలను, ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రగతి భవన్‌లో కరోనా వ్యాప్తి పై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పై ప్రకటన రావడం గమనార్హం.

కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయం : సీఎం

“కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం హైదరాబాద్. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉండటం సహజం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్‌లో కూడా 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్‌ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్‌ను సమావేశ పరిచి, జీహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు

జీహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. తిరిగి లాక్‌డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని సీఎం స్పష్టం చేశారు. వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులతో పాటు ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితరులతో ప్రగతి భవన్‌లో సీఎం ఆదివారం మధ్యాహ్నం సుదీర్ఘ సమావేశాన్ని ఏర్పాటుచేసి కరోనా వ్యాప్తి, నివారణ చర్యల్లాంటి అంశాలపై చర్చించారు.

వైద్య నిపుణులు లాక్‌డౌన్ అవసరమంటున్నారు : ఈటల రాజేందర్

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. “దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్‌గా తేలినవారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్‌లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేనివారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం” అని ఈటల రాజేందర్ వివరించారు. వైద్యాధికారులు, వైద్య నిపుణులు మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని కోరుతున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

కరోనా మరణాలు జాతీయ సగటుకన్నా తక్కువే : శాంతికుమారి

వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందినవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, జాతీయ సగటు 3.04% ఉంటే తెలంగాణలో కేవలం 1.52% మాత్రమే అని సీఎంకు వివరించారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన వారికి తగిన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story