డిపోకు లాక్.. ఇన్‌కం లాస్!

by Shyam |
డిపోకు లాక్.. ఇన్‌కం లాస్!
X

దిశ, మహబూబ్ నగర్: మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే గత సంవత్సరం చివర్లో 51 రోజులపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా భారీగా నష్టాలను కూడగట్టుకున్న ఆర్టీసికి ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ మరింత నష్టాల ఊబిలోకి నెట్టింది. అప్పుల ఊబిలో నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని టికెట్ల ధరలను పెంచారు. పెంచిన ధరల మూలాన కొంత లాభాలబాట పట్టిన ఆర్టీసీకి ప్రస్తుత లాక్‌డౌన్ మరోసారి నష్టాల బాటలోకి నెట్టిందనే చెప్పాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రీజియన్‌గా మొత్తం 9 డిపోలు ఉండగా అందులో 880 బస్సులు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,200 మంది ఆర్టీసీ సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో ప్రతీ రోజు జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు సుమారు 3.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 10 లక్షలకు పైచిలుకు ప్రయాణికులను తమ గమ్యస్థలాలకు చేర్చుతుంటాయి. దీని వల్ల ప్రతీ రోజు ప్రయాణికుల నుంచి ఆర్టీసికి రూ.90 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు అదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు.

డిపో దాటని బస్సులు..

గడిచిన 32 రోజులుగా లాక్‌డౌన్ కారణంగా బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితం కావడం వల్ల ప్రతీ రోజు ఆర్టీసీకి కోటి రూపాయల వరకు నష్టం జరుగుతున్నదని వారు చెబుతున్నారు.

6 బస్సులు మాత్రమే..

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితులలో మాత్రమే 6 బస్సులను మాత్రమే నడుపుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో బస్టాండ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 5వ తేది నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఆర్టీసి కార్మికులు సమ్మెబాట పట్టడంతో సంస్థ తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నది. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని కార్మికులకు వరాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసిని కాపాడేందుకు కావాల్సిన చర్యలతోపాటు నిధులను కూడా కేటాయించారు. సమ్మెకాలానికి సంబంధించిన వేతనాలను కూడా కార్మికులకు చెల్లించడం జరిగింది. అదే సమయంలో ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచి ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ఆయన ప్రయత్నం చేశారు.

కష్టాలను తెచ్చిపెట్టింది..

ఈ చర్యలతో ఆర్టీసీ గాడిలో పడుతున్న నేపథ్యంలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో మరోసారి ఆర్టీసీకి కష్టాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి. గత నెలకు సంబంధించి కార్మికులకు సంస్థ పూర్తిస్థాయి జీతాలను చెల్లించగా ఏప్రిల్ మొత్తం కూడా బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో కార్మికుల వేతనాలు ఎలా ఇవ్వాలనే విషయంలో సంస్థ ఇప్పటికే ఆలోచనలో పడింది. అదే సమయంలో ఆర్టీసీలో చాలామంది చిరువ్యాపారులు తమ జీవనం సాగిస్తుంటారు. కానీ, లాక్ డౌన్ ప్రభావం వారిపై తీవ్రంగానే పడిందని చెప్పవచ్చు.

ఇబ్బందికరంగా ..

లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి చిరు వ్యాపారులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం స్పందించి తాము ప్రతి నెలా ఆర్టీసికి చెల్లించాల్సిన షాపుల బాడుగ మినహాయింపు ఇస్తే తమకు మేలు జరుగుతుందని వారు ప్రభుత్వాని కోరుతున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో తమకు రుపాయి ఆదాయం లేని సమయంలో బాడుగ కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు వాపోతున్నారు. అదే సమయంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బస్సులు నడవకపోవడంతో వారికి గత నెలకు సంబంధించిన జీతాలు కూడా సంబంధిత బస్సుల యజమానులు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

tags:Mahabubnagar, RTC, Problems, Loss of Livelihood, RTC Employees, corona effect

Advertisement

Next Story