- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్‌లో ఆంక్షలకు ఆరునెలలు!
ఉన్నట్టుండి కశ్మీర్‌కు పెద్దమొత్తంలో అదనపు బలగాలు తరలివచ్చాయి. ప్రతివీధిలో స్థానికుల కంటే జవాన్లే అధికంగా కనిపించారు. విదేశీ పర్యాటకులు కశ్మీర్‌ను వీడాలని ఆయా దేశాలు ఆదేశించాయి. కశ్మీరీల్లో కలవరం మొదలైంది. కేంద్రం చెప్పిన ఉగ్రవాద సాకును నమ్మడానికి వారు సిద్ధపడలేదు. రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం తొలగించనున్నదా? అన్న అనుమానాలు చాలామంది కశ్మీరీలో బలపడ్డాయి. అటువంటిదేమీ లేదని బీజేపీ అగ్రనేతలు చెప్పినట్టు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటన వారికి కాస్త ఊరటనిచ్చింది. కానీ, రోజుల వ్యవధి(ఆగస్టు 5న)లో కశ్మీరీల అనుమానమే నిజమైంది.
2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణం 35ఏను కేంద్రం రద్దు చేసింది. 370ని నీరుగార్చింది. ఈ నిర్ణయం నేపథ్యంలోనే భారీ మొత్తంలో బలగాలను మోహరింపజేసి ఆంక్షలు విధించింది. పదులు, వందల సంఖ్యలో రాజకీయ కార్యకర్తలు, పౌరులను నిర్బంధించింది. ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను, వేర్పాటువాదులను ఆ రాష్ట్రానికి సీఎంగా సేవలందించినవారిపైనా నిర్బంధాన్ని ప్రయోగించింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్. రోడ్డుపైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండాపోయింది. చేతిపై పోలీసు అధికారుల ముద్రవేసుకుంటేగాని కశ్మీరీలు బయటికెళ్లలేని దుస్థితిని కొన్ని ఫొటోలు వెల్లడించాయి.
కశ్మీర్‌పై ఆంక్షలు విధించి ఆరు నెలలు గడిచాయి. నిర్బంధించిన చాలామంది పౌరులను, రాజకీయ నేతలను కేంద్రం విడిచిపెట్టినప్పటికీ ఇప్పటికీ ముగ్గురు మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను నిర్బంధంలోనే ఉంచింది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేక పాత్రికేయులు ఇప్పటికీ సమస్యలనెదుర్కొంటున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను కేంద్రం దశలవారీగా ఎత్తివేస్తున్నది. అయితే, ఇంటర్నెట్ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేవు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగాలని కాంక్షించే, ప్రజాస్వామికంగా ఎన్నికై సేవలందించిన ముగ్గురు సీఎంలను ఇప్పటికీ నిర్బంధంలోనే ఉంచడంపై హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.
మెజార్టీ కశ్మీరీలు స్వతంత్ర కశ్మీర్ కావాలని కోరుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతుంటారు. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు కశ్మీర్ దాని స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోవడమే కాదు. అసలు రాష్ట్ర హోదాకే దూరమైంది. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 30 నుంచి ఆ రాష్ట్రం జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారికంగా విడిపోయాయి.
ఆర్టికల్ 370 నిర్ణయానికి ముందు జమ్మూ కశ్మీర్‌లో కొన్ని అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో కొన్ని కీలక మలుపులను పరిశీలిద్దాం..
2014 జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితం రావడంతో కొన్ని నెలల చర్చ అనంతరం బీజేపీ, పీడీపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అనేక అసంతృప్తుల మధ్యనే ఈ కుంపటి కొనసాగింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో మూడుసార్లు గవర్నర్ పాలన అమలులోకి రావడం ఇందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన బీజేపీ మిలిటెంట్లు, రాళ్లు విసిరేసే పౌరులపై దూకుడు(కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్) ప్రదర్శించింది. 2016 జూలైలో మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్‌పై పీడీపీ, బీజేపీ మధ్యలో పొరపొచ్చాలు వచ్చాయి. (నిజానికి బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో మిలిటెన్సీలోకి యువత చేరిక ఎక్కువైందని పలు నివేదికలు వెల్లడించాయి) వనీ మరణంతో హింసాత్మక ఆందోళనలు జరుగుతాయన్నదానిపై ఇరుపార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్లు, ఘటనాస్థలాల్లో పౌరుల మరణాలతో ఈ భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో 2018 జూన్‌లో సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలులోకి వచ్చింది.
ఆరునెలల గవర్నర్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన అమలైంది. దీంతో కశ్మీర్‌ను కేంద్రం తన అధీనంలోకి తీసుకున్నట్టయింది. 2019 ఆగస్టులో ఆంక్షలు, నిర్బంధాల మధ్య కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసింది. ఇప్పటికీ ఈ నిర్బంధపు ఛాయలోనే కశ్మీరీలు జీవిస్తున్నట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి.