మనీజ.. అప్ఘాన్ ఫస్ట్ ఫిమేల్ బ్రేక్‌డ్యాన్సర్

by Shyam |   ( Updated:2021-01-27 08:30:29.0  )
మనీజ.. అప్ఘాన్ ఫస్ట్ ఫిమేల్ బ్రేక్‌డ్యాన్సర్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్ఘానిస్థాన్‌లో మహిళలు, అమ్మాయిలు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా తమ కలల తీరం వైపు ప్రయాణిస్తూ, అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఇస్లామిక్ సమాజంలో సంప్రదాయ కట్టుబాట్లను ధిక్కరించి రాబోయే తరాలకు మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో 18 ఏళ్ల మనీజ తలాష్ తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ కళలో రాణిస్తూ, అప్ఘానిస్తాన్ తొలి బ్రేక్ డాన్సర్‌గా నిలవడమే కాకుండా, తమ దేశం తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించడానికి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది.

మనీజ తనకు ఎంతో ఇష్టమైన బ్రేక్ డ్యాన్స్‌లో శిక్షణ పొందేందుకు కొన్ని నెలల క్రితమే అప్ఘానిస్థాన్‌లోని ‘బ్రేక్ డ్యాన్సింగ్ కమ్యూనిటీ’లో జాయిన్ అయింది. ఆ గ్రూప్‌లో ఆమె ఒక్కరే మహిళ. అప్ఘాన్‌లో మహిళలపై విధించే ఆంక్షల గురించి వేరేచెప్పనక్కర్లేదు. అప్ఘాన్లు డ్యాన్స్‌కు వ్యతిరేకం. అందులోనూ స్త్రీలు బహిరంగంగా నృత్యం ప్రదర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో ఆమెను చంపుతామనే బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె తన కళను వదులుకోలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. డ్యాన్స్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే వచ్చింది.

అప్ఘానిస్థాన్‌ మహిళలకు స్వేచ్ఛగా బతికే హక్కే కాదు, అసలు సాధారణమైన జీవితం గడపరాదు. గత రెండు దశాబ్దాల నుంచి మహిళా స్కూళ్లను టార్గెట్ చేసిన తాలిబన్లు ఎంతోమంది ఆడవాళ్లను చంపేశారు. ‘తాలిబాన్స్ తిరిగి రావడం గురించి నేను ఆలోచించినప్పుడు, నేను బ్రేక్‌డ్యాన్సింగ్ సాధన కొనసాగించలేకపోతున్నాను, నేను చాలా కలత చెందుతున్నాను. కానీ, నేను రోల్ మోడల్ అవ్వాలనుకుంటున్నాను, కళను నెరవేర్చుకున్న మహిళగా ముందు తరాలకు ఆదర్శ వనితగా నిలవాలనుకుంటున్నాను’ అని మనీజ అంటోంది. ఏడాది క్రితం ప్రారంభమైన బ్రేక్ డ్యాన్స్ అకాడమీలో ప్రస్తుతం 30 మంది సభ్యులుండగా, మనీజ తర్వాత మరో ఐదుగురు మహిళలు ఇందులో జాయిన్ అయ్యారు. వారంలో మూడు రోజుల పాటు, ఆక్రోబాటిక్ మూవ్స్, హెడ్ స్పిన్స్, ఇతర బ్రేక్ డ్యాన్సింగ్ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మనీజ డ్యాన్స్ ప్రతిభ, ఆమె సంకల్పమే ఆమెను ‘ఒలింపిక్స్’లో బ్రేక్ డ్యాన్సింగ్‌లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా చేశాయి.‘బ్రేక్ డ్యాన్స్’ను ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1970లో న్యూయార్క్ సిటీ వీధుల్లో బ్రేక్ డ్యాన్స్ పుట్టింది.

Advertisement

Next Story