ప్రియురాలి కోసం సాహసం.. చివరికి..

by srinivas |
ప్రియురాలి కోసం సాహసం.. చివరికి..
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ విరహాన్ని అనుభవించలేకపోయిన ప్రియుడు… ప్రియురాలి కోసం సాహసం చేశాడు. ఎలాగో ఆమెను కలుసుకున్నాడు. అయితే ప్రియుడు చివరికి అసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన ఓ యువకుడు స్థానికంగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గిరింపేటకు చెందిన యువతితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె కోసం తరుచూ చిత్తూరు వెళ్లి వస్తుండేవాడు. అయితే, ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ విధించడంతో వారిద్దరికీ కలుసుకునే వీలు పడలేదు. విరహ వేదన అనుభవించలేకపోయిన యువకుడు ఎలాగోలా ప్రియురాలిని కలవాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. టూ వీలర్‌లో వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి, కూరగాయల లారీలో ఆంబూరు నుంచి పలమనేరుకు చేరుకుని అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగి స్వగ్రామానికి చేరుకుంటుండేవాడు.

ఈ క్రమంలో వారం రోజుల క్రితం యువకుడు ప్రయాణించిన లారీని చిత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి అందులోని 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆంబూరుకు చెందిన సదరు యువకుడు కూడా క్వారంటైన్ కేంద్రానికి చేరాడు. అక్కడ వైద్యపరీక్షలు చేయగా, సదరు ప్రియుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ కూపీ లాగిన పోలీసులకు అతని వివాహేతర సంబంధం, లాక్‌డౌన్ విరహం గురించి తెలిసింది. దీంతో అతను తిరిగిన ప్రదేశాలు, అతను కలిసిన వారిపై కూపీ లాగారు. తిరుపత్తూరు ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు అతను నివసించే ప్రాంతాన్ని సీల్ చేశారు. అంతే కాకుండా అతనితో కలిసి లారీలో ప్రయాణించిన కూరగాయల వ్యాపారులు, బ్యాటరీ కంపెనీ సిబ్బంది మొత్తం 220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వస్తే ఎంతమందికి సోకిందో తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed