సిద్దిపేట చుట్టుపక్కల నకిలీ మద్యం జోరు!

by Shyam |
సిద్దిపేట చుట్టుపక్కల నకిలీ మద్యం జోరు!
X

దిశ, మెదక్: మద్యం ప్రియులారా… మీరు దొంగచాటుగా తాగే మద్యం అసలైన మద్యం కాదు. మీ ఆరోగ్యం జాగ్రత్త! కొందరు అక్రమార్కులు తమ జేబులు నింపుకోవటం కోసం స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ మద్యం సేవిస్తే మీ ఆరోగ్యం అంతే సంగతి!

కరోనా లాక్‌డౌన్ కొందరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోన్నది. లాక్‌డౌన్ కారణంగా వైన్స్, బార్ షాపులు ముతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులకు మద్యం దొరక్కపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు మద్యం వ్యాపారులు షాపులకు ఎక్సైజ్ శాఖ వేసిన సీళ్లను తొలగించి చాటు మాటునా మద్యాన్ని అధికధరలకు విక్రయిస్తున్నారన్న ప్రచారం సాగింది.

సిద్దిపేట చుట్టుపక్కల…

సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం విచ్చలవిడిగా దర్శనమిస్తుంది. మొన్నటి వరకు మద్యం కోసం తహతహలాడిన వారు నేడు మద్యం కావాలా? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంది, ఎన్ని కావాలో చెప్పు అంటూ ఆర్డర్లు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు. ఎక్కడ చూసినా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం పెట్టెలే కనబడుతున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద ఎత్తున డంప్ చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.

అసలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం ఇంతలా ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతున్న ప్రశ్న. లాక్ డౌన్‌తో రాష్ట్రాల సరిహద్దులు ముసివేశారు. బార్డర్ రహదారులపై పోలీసుల నిఘా, తనిఖీలు పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర నంచి మన రాష్ట్రం, జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయినా ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మద్యం తరలించటమనేది అసాధ్యం. ఈ సందర్భంలో జిల్లాలో పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం చలామణి కావటం పలు సందేహాలకు తావిస్తోన్నది. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఓ మద్యం వ్యాపారి తన వాహనంలో మధ్యప్రధేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. మద్యం విక్రయిస్తున్న ఆ వ్యాపారి నుంచి పన్నెండు పెట్టెల మద్యం, ఐదు లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సిద్దిపేట పరిసర ప్రాంతాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం పేరిట చలామణి అవుతోన్న మద్యం అసలు మద్యం కాదని, అది నకిలీ మద్యం అని స్పష్టమవుతోంది.

మధ్యప్రదేశ్ పేరిట నకిలీ మద్యం

ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి మద్యం తేవటానికి వీలులేదు. మొన్నటి వరకు అందుబాటులో లేని మద్యం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం పేరిట కొందరు మాఫియాగా ఏర్పడి నకిలీ మద్యం తయారు చేసి అక్రమార్కులకు సరఫరా చేస్తున్నాట్లు సమాచారం. రెండు రోజులుగా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర లేబుల్ తో సూమారు 2, 3 కోట్ల మద్యం విక్రయించినట్లు సమాచారం. ఈ మద్యం సేవించినవారు మద్యం రుచి మారిందని, స్పిరిట్ వాసన, రుచి ఉందంటూ తమకు విక్రయించిన వారితో గొడవపడిన సందర్భాలు సైతం ఉన్నాయి.

సిద్దిపేట పట్టణంలో ఓ పేరు మోసిన మద్యం వ్యాపారి, గతంలో కల్తీ మద్యం తయారు చేసి విక్రయాలు చేసిన ఆ వ్యాపారి ఈ నకిలీ మద్యం సూత్రధారి అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఆ లిక్కర్ మాఫియా నేత ఇలాంటి వాటిలో పేరు మోసిన వ్యక్తిగా, ఈ నకిలీ మద్యం, మధ్యప్రదేశ్ రాష్ట్రం పేరిట చలామణి చేస్తున్న వ్యక్తి అతడేనని ప్రచారం సాగుతోన్నది. ఏదిఏమైనా ప్రస్తుతం మీరు దొంగచాటుగా సేవిస్తున్న మద్యం మాత్రం అసలైన మద్యం కానే కాదు జాగ్రత్త.. లేదంటే మీ ఆరోగ్యం అంతే సూమా….!

Tags: Medak, Adulterated liquor, Madhya Pradesh liqueur, borders

Advertisement

Next Story