ఏపీలో యూజీ, పీజీ పరీక్షలు కూడా రద్దుకానున్నాయా?

by srinivas |
ఏపీలో యూజీ, పీజీ పరీక్షలు కూడా రద్దుకానున్నాయా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నానాటికీ విస్తరిస్తోంది. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 22 రోజుల్లో సుమారు 5 వేల కరోనా కేసులు నమోదయ్యాయంటే వ్యాధి విస్తరణ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రద్దు చేస్తూ, ఆయా తరగతుల్లో చదువుతున్నవారంద్నీ పాస్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం లేని నేపథ్యంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను కూడా రద్దు చేయాలా? అన్న ఆలోచనలో మునిగిపోయింది. విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కరోనా లాక్‌డౌన్ తరువాత కళాశాలలు తెరుస్తారు, పరీక్షలు రాద్దామని భావించారు. లాక్‌డౌన్ సడలింపులిచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, బీఈ, బీఈడీ, ఎల్ఎల్‌బీ పరీక్షలతో పాటు ఎంఏ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎంటెక్ వంటి కోర్సుల పరీక్షలు కూడా రద్దు చేయాలా? లేక నిర్వహించాలా? అన్నదానిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేటి సాయంత్రం యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై స్పష్టమైన అవగాహనకు వస్తారు.

Advertisement

Next Story

Most Viewed