ఎల్లుండే సివిల్స్ ఎగ్జామ్.. అలా రాకపోతే నో ఎంట్రీ : అదనపు కలెక్టర్

by Shyam |   ( Updated:2021-10-08 06:59:51.0  )
additional collector venkateswarlu
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా అక్టోబరు 10వ తేదీన నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు-2021 పరీక్షలు సజావుగా నిర్వహించాలని హైదరాబాద్ అదనపు కలెక్టర్, అడిషనల్ కో-ఆర్డినేటింగ్ సూపర్ వైజర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని శంకర్‌జీ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 101 కేంద్రాలలో 46,953 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష రెండు సెషన్ల ఉంటుందని, ఉదయం 9.30 నుండి 11.30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుండి 4.30 గంటల వరకు మరో సెషన్ ఉంటుందని వెల్లడించారు.

అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని, సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని కోరారు. మాస్కులు లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో ఎవరికైనా శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు ఉంటే వారిని ఇన్విజిలేటర్లు గుర్తించి సూపర్ వైజర్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అలాంటివారికి ప్రత్యేక గది ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగా శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, మోబైల్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, వాచ్‌లు, పర్సులు వంటివి పరీక్షా కేంద్రాల్లో అనుమతించబోరని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. వెన్యూ సూపర్ వైజర్లు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచి అభ్యర్థులను సానిటైజ్ చేయాలని, పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని, అంతేగాకుండా పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వెన్యూ సూపర్వైజర్లతోపాటు 101 మంది లోకల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని, 34 మంది రూట్ ఆఫీసర్లు నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed