ఎయిర్ఇండియా వేలానికి అదానీ గ్రూప్ రెడీ!

by  |
ఎయిర్ఇండియా వేలానికి అదానీ గ్రూప్ రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : పూర్తీగా నష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను కొనేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వేలానికి అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడానికి సంస్థ ఆలోచిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఎయిర్ఇండియాపై ప్రాథమిక స్థాయిలోనే ఆలోచిస్తోందని, ఎయిర్ఇండియాకు ఉన్న అప్పులు, నష్టాలను అధ్యయనం చేసి మదింపు ఆధారంగానే నిర్ణయం ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. బిడ్డింగ్ నిబంధనలను అనుసరించి అడ్డంకులేమీ లేనప్పటికీ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు ఎంతమేరకు అడ్డంకిగా ఉంటాయో అంచనా వేస్తున్నట్టు అదానీ గ్రూప్ వివరించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల పరంగా చూస్తే…ఏ విమానయాన సంస్థలోనైనా ఎయిర్‌లైన్ గ్రూపులకు విమానాశ్రయాల్లో 27 శాతానికి మించి వాటా ఉండకూడదు. ఇప్పటివరకూ ఆరు విమానాశ్రయాల్లో వాటా కలిగిన అదానీ సంస్థకు ఇది అడ్డంకిగా మారొచ్చనే సందేహంలో ఉంది.

అయితే, ఇదివరకూ ఎయిర్ఇండియా వేలం కోసం ఇచ్చిన మార్చి 17 గడువును కేంద్రం పొడిగించే సూచనలు కనబడుతున్నాయి. కొత్త తేదీని మంత్రిత్వ శాఖ మరో వారంలోగా వెల్లడించే అవకాశముంది. ఎయిర్ఇండియా వేలానికి ఆసక్తి ఉన్న సంస్థలు నాన్-రీఫండబుల్ రుసుము కింద రూ. కోటి చెల్లిస్తే ఎయిర్ఇండియా వివరాలను, షేర్ల కొనుగోలుకు సంబందించి ఒప్పందం ముసాయిదాను చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టైతే లావాదేవీ సలహాదారు, పౌర విమానయాన శాఖ ఆసందేహాలను తీరుస్తుందని తెలిపారు. ఇదివరకు సందేహాలను తీర్చుకోవడానికి ఫిబ్రవరి 11 గడువును కేంద్రం మార్చి 6కు పొడిగించడం జరిగింది. ఎయిర్ఇండియాకు దాదాపు రూ. 60,000 కోట్ల అప్పులున్నాయి. వేలంలో ఎయిర్ఇండియాను దక్కించుకునే సంస్థ రూ. 23,286 కోట్ల అప్పులకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.


Next Story