ఆ క్షణాలు నా జీవితంలో చాలా ముఖ్యం : సోనూసూద్

by Jakkula Samataha |
sonu sood
X

దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా పాండమిక్ సమయంలో తాను పోషించిన పాత్ర నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని, ఆ క్షణాలను నేనెప్పుడు మర్చిపోలేనని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ అన్నారు. ఈ ప్రయాణంలో దాదాపు 7.26 లక్షల మందికి కనెక్ట్ కాగలిగామని, విదేశాల్లో చదువుకుంటున్న 3,500 మంది విద్యార్థులను స్వదేశాలకు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వాలెంటీర్లుగా పనిచేసిన వారిని ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ గచ్చిబౌలి సంధ్య కన్వెక్షన్ హాల్లో బుధవారం సత్కరించింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోనూసూద్ మాట్లాడుతూ.. అతిథి కార్మికులు (వలస కార్మికులు) నిజమైన హీరోలు అని కీర్తించారు. త్వరలోనే కార్పొరేట్ సంస్థలతో కలిసి అవసరమైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 2లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. అతిథి కార్మికులను 40 రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపించినట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రతిరోజూ 3 వేల ఫోన్ కాల్స్ వచ్చేవన్నారు. మొత్తంగా 8 వేల ప్లాస్మా యూనిట్లను సేకరించామన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ను సీపీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్, సింగర్ స్మిత, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) కార్యదర్శి కృష్ణ యోదుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story