అనుకున్నదోటి అయ్యిందోటి..ఎక్సైజ్ ఎస్సై అరెస్టు

by Sridhar Babu |   ( Updated:2020-06-10 09:40:53.0  )
అనుకున్నదోటి అయ్యిందోటి..ఎక్సైజ్ ఎస్సై అరెస్టు
X

దిశ, కరీంనగర్ :
కరోనా సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. తమకు సంబంధం లేకున్నా ఓ మ్యాటర్‌లో తలదూర్చి రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. కట్ చేస్తే.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి వైన్ షాప్ సమీపంలో కవ్వంపల్లి సురేష్, తిరుపతి, సంజీవ్ దాబా నిర్వహిస్తున్నారు. ఇన్నిరోజులు మూసి ఉంచిన దాబాను లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తెరిచారు. ఈ క్రమంలోనే దాబాపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపి అందులోని సామగ్రిని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. రూ.2 లక్షలు ఇస్తేనే సామగ్రి రిటర్న్ చేస్తామని, కేసులేకుండా చూస్తామని వారిని భయాందోళనకు గురిచేశారు. దాబా యజమాని ఎక్సైజ్ ఎస్సైతో మాట్లాడుతూ తాము కేవలం భోజనం మాత్రమే అమ్ముకుంటున్నాం, సిట్టింగ్ నిర్వహించడం లేదు కదా అని అడిగారు. అందుకు బదులుగా ఎక్సైజ్ స్టేషన్‌కు వచ్చి కలవాలని చెప్పారు. మరునాడు అతను ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లగా రూ.25 వేలు ఇస్తే.. ఎక్సైజ్ సీఐ, అందరినీ తానే చూసుకుంటానని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సై సుస్మిత చెప్పినట్టు ఓనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అన్యాయంగా తమను డబ్బులు అడుగుతున్నారని భావించిన దాబా ఓనర్ చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన డీఎస్పీ భద్రయ్య దాడికి పూనుకున్నారు. సిరిసిల్ల సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.20 వేలు ఇచ్చేందుకు దాబా ఓనర్ వెళ్లగా, సిరిసిల్ల ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన రాజు అనే కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ పరారయ్యాడు. దీంతో ఏసీబీ అధికారులు సిరిసిల్ల స్టేషన్‌లో ఉన్న ఎస్సై సుస్మితను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుస్మిత, కానిస్టేబుల్ రాజు పై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ కడారి భద్రయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed