ఓనం పండుగకు బలి చక్రవర్తి వస్తే?

by  |
ఓనం పండుగకు బలి చక్రవర్తి వస్తే?
X

దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణ భారతదేశంలోని కేరళలో అతిపెద్ద పండుగ ‘ఓనం’. ఇది మలయాళీ క్యాలెండర్‌లో మొదటి నెల అయిన చింగం(ఆగస్టు-సెప్టెంబర్)లో వస్తుంది. మహా బలి చక్రవర్తి ఆ ప్రాంతానికి తిరిగి రావడాన్ని ఇది సూచిస్తుంది. పది రోజుల పాటు జరిగే ఓనం పండుగ.. ఈ సంవత్సరం ఆగస్టు 22న మొదలై, సెప్టెంబర్ 2న ముగియనుంది. తెలుగు రాష్ట్రాల్లో వరికోత పండుగగా ‘సంక్రాంతి’ని ఎలాగైతే జరుపుకుంటామో.. కేరళలో ఓనం పండుగ కూడా అంతే. చరిత్రను పరిశీలించినా పూర్వం నుంచి కూడా కేరళ ప్రజలు మావేళి (బలి చక్రవర్తి)ని పూజించడం ఆచారంగా వస్తోంది. అయితే, ఈ కరోనా పాండమిక్ టైమ్‌లో కేరళ ప్రాంతానికి మావేళి.. వస్తే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అనే ఇతివృత్తంతో ఓ యానిమేషన్ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఓనం పండుగ సందర్భంగా ఎప్పటిలానే.. ఈ సారి కూడా ‘మావేళి’ కేరళ ప్రాంతానికి వస్తాడు. అయితే, ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పేరొందిన కేరళ గడ్డమీద అడుగుపెట్టగానే మహా రాజు(మావేళి) సంతోషంతో డ్యాన్స్ చేస్తుంటాడు. గతంలో వచ్చినట్టుగానే ఈ సారి కూడా మాస్క్ ధరించకుండానే కేరళలో అడుగుపెట్టిన ఆయనకు.. డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తుమ్ములు వస్తాయి. అంతే క్షణాల్లో అంబులెన్స్‌లో పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు మెడికల్ ప్రొఫెషనల్స్ రావడంతో మహా రాజు వాళ్లను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు. అయితే, వాళ్లు కూడా రాజుతో రెండు స్టెప్పులేసిన తర్వాత ఆయనను తెల్ల గుడ్డలో చుట్ట చుట్టేస్తారు. ఓ మాస్క్ అతని ముఖానికి తొడిగి తీసుకెళ్తారు. చివరలో ‘హ్యాపీ కరోనమ్’ (happy corONAM) అనే టైటిల్‌తో ఎండ్ అవుతుంది. ‘మాస్క్ ధరించండి, ప్రాణాలను కాపాడండి’ అనే కాన్సెప్టుతో రూపొందిన ఈ యానిమేషన్ వీడియోను ‘సువి విజయ్’ అనే వ్యక్తి డైరెక్ట్ చేశాడు.

ఇక చరిత్ర ప్రకారం.. మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగంగా చెప్పొచ్చు. అతని పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, సిరిసంపదలతో ఆరోగ్యంతో ఉన్నారు. అందుకే రాజ్య ప్రజలంతా తమ రాజును చాలా గౌరవించేవారు. అయితే, మహాబలికి సుగుణాలతో పాటు ఒక లోపం కూడా ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, తను చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చిన వామనుడు.. మహాబలి తన రాజ్య ప్రజలను ఏడాదికోసారి కలుసుకునేటట్లుగా అతనికి వరమిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం మహాబలి వచ్చే రోజును కేరళ ప్రజలు ‘ఓనం’ పండుగగా జరుపుకుంటారు. ఈ సారి కరోనా పరిస్థితుల కారణంగా.. ఓనం వేడుకలను ఇంట్లోనే చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed